బలగం, బలం మీరే
ప్రజలతో మమేకమయ్యేందుకే “తొలి పొద్దు” కార్యక్రమం
* ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూరు, ఆగస్టు 2 ( జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, బలం, బలగం ప్రజలేనని ప్రజా ఆశీర్వాదం ఉన్నంతకాలం విపక్ష పార్టీలు అధికారానికి ఆమడ దూరంలో ఉండటం ఖాయమని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యానించారు. కేవలం, ఆసరా పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కే గ్రామాల్లో పర్యటిస్తున్నానని అవాకులు, చవాకులు విసురుతూ, ప్రతిపక్ష పార్టీల నాయకులు కళ్ళులేని కబోది లా విమర్శిస్తున్నారని అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని వారి సేవకు అంకితం అవ్వటానికే ఉదయం వేళల్లో తొలి పొద్దు కార్యక్రమం చేపట్టి బడుగు జీవుల ముంగిళ్లలో వారి కళ్లల్లో ఆనందం నింపుతున్న మన్నారు. శుక్రవారం మండలంలోని వేడుక మందిరంలో ఇటీవల మంజూరైన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అడ్రస్ గల్లంతు అవుతుందనే భయంతోనే కాషాయ నేతలు భరోసా యాత్ర చేపట్టారని విపక్షాలకు చురకలంటించారు. ప్రజా సంక్షేమం పట్టని గత పాలకులు నిరంతరం ప్రజల అభివృద్ధి సంక్షేమ ద్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటు ఆ న్నారు. మానకొండూరు నియోజకవర్గం పరిధిలో 110 కోట్ల రూపాయలు అందిస్తున్న ఘనత తమదేనన్నారు. మానకొండూరు మండల పరిధిలో పదివేల మంది లబ్ధిదారులకు రెండు కోట్లకు పైగా పింఛను అందిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఎంతవరకైనా తెగించి ముందడుగు వేస్తామన్నారు. వేడుకల మందిరం ఆసరా లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది.కార్యక్రమం ఆసాంతం పండుగల కొనసాగింది. కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, స్థానిక జడ్పిటిసి శేఖర్ గౌడ్ ప్రసంగించారు