బలపరీక్షలో నెగ్గిన రావత్‌

4

– అధికారికంగా ప్రకటించిన ‘సుప్రీం’

– ప్రజాస్వామ్యం గెలిచింది:హరీశ్‌ రావత్‌

– సంబురాల్లో శ్రేణులు

డెహ్రాడూన్‌,మే11(జనంసాక్షి):ఎట్టకేలకు ఉత్తరాఖండ్‌ సంక్షోభానికి తెరపడింది. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌ మంగళవారం జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీలో ఆయన మెజారిటీ నిరూపించుకున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో విజయోత్సాహం నిండింది. నైతికంగా కూడా కాంగ్రెస్‌ విజయం సాధించగా బిజెపి పరువు పోగొట్టుకుంది.  కేంద్రం తరఫున మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరైన అటార్నీ జనరల్‌ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో హరీష్‌ రావత్‌ మెజారిటీ నిరూపించుకున్నట్టు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ అమలులో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కూడా కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం తరఫు వాదన విన్న అత్యున్నత న్యాయస్థానం హరీష్‌ రావత్‌ బలపరీక్షలో నెగ్గినట్టు అధికారికంగా ప్రకటిస్తూ… ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చంటూ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష జరిగింది. హరీష్‌కు అనుకూలంగా 33, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. హరీష్‌రావత్‌ సైతం తాము విజయం సాధించినట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓటింగ్‌ వివరాలను సీల్టు కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించగా, బుధవారం ఫలితాలను సుప్రీంకోర్టు స్వయంగా ప్రకటించింది. దీంతో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో  ఉత్తరాఖండ్‌లో హరీశ్‌రావత్‌ తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. శాసనసభలో జరిగిన బలపరీక్షలో 61 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా… 9 కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దీంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బలపరీక్షలో హరీశ్‌రావత్‌కు మద్దతుగా 33 ఓట్లు వచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిందిగా ఆయనకు సూచించింది. దీంతో గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది. ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్టీ ఫిరాయింపులు, రెబెల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడం, మెజార్టీ లేదంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం, రెబెల్స్‌, సర్కార్‌ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కోర్టును ఆశ్రయించడం, ఈ మధ్యలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారంటూ స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలు వెలుగుచూడటం.. ఇలా ఉత్తరాఖండ్‌లోఎన్నో రాజకీయ మలుపులు తిరిగింది. తరవాతి పరిణామాలతో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ అధికారికంగా విజయం సాధించారు.దీంతో ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. మొత్తానికి ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ అనూహ్యవిజయం సాధించింది. గతంలో ఎన్నోరాష్టాల్ల్రో రాష్ట్రపతి పాలనవిధించిన కాంగ్రెస్‌ ఇప్పుడు అనూహ్యంగా విజయం సాధించి బిజెపిని దెబ్బకొట్టింది.