బలప్రదర్షనకు ముందే మాంఝీ అస్త్రసన్యాసం
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
బీహార్ సీఎంగా ఆదివారం నితీశ్ ప్రమాణం
పాట్నా,ఫిబ్రవరి20(జనంసాక్షి): బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మలుపులు తిరిగి, చివరకు శుక్రవారం బలనిరూపణకు ముందే సిఎం మాంఝీ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను చంపుతామని బెదిరింపులు వచ్చాయని మాంఝీ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాంఝీ శుక్రవారం బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా, బలనిరూపణకు ముందే సిఎం పదవికి రాజీనామా సమర్పించారు. శుక్రవారం ఉదయం బిహార్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. బిహార్ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేశారు. జితన్ రామ్ రాజీనామాను రాజ్‌భవన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. బిజెపి మద్దతిచ్చేందుకు సిద్ధమైనా ఇతర పక్షాల మద్దతు కూడగట్టడంలో జితన్‌రామ్ విఫలమయ్యారు. దీరికి తోడు అనూహ్యంగా స్పీకర్ జెడియూ నేతను విపక్షనేతగా గుర్తించి సంచలనం సృష్టించారు. బిహార్ శాసనసభలో మొత్తం 243 స్థానాలు కాగా… ప్రస్తుతం 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జేడీయూకి 110 మంది, భాజపాకు 87 మంది, ఆర్జేడీకి 24మంది, కాంగ్రెస్‌కు ఐదుగురు, సీపీఐకి ఒక్కరు, ఐదుగురు స్వతంత్రులు, మాంఝీ ఉన్నారు. పది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ నితీశ్‌కుమార్ (జేడీయూ)కు మద్దతిస్తున్నాయి. భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో సహా మాంఝా వర్గంలో 100 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. దీంతో నితీష్ వర్గాన్ని ఢీకొట్టలేక… బలపరీక్షకు ముందే పదవి నుంచి తప్పుకోవడం మేలని భావించిన మాంఝీ సీఎం పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. తగినంత సంఖ్యాబలం లేక పోయినప్పటికీ… విశ్వాస పరీక్షలో నెగ్గుతామని ముందు నుంచీ చెబుతున్న జితన్‌రామ్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. జితన్‌రామ్ రాజీనామాతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం అందుకునేందుకు మార్గం సుగుమమైంది.
ఇక బీహార్ సీఎంగా ఆదివారం నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఆయనకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్ ఆహ్వానించారు. గతంలోనే ఆయన సిఎంగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీహార్‌లోని విపక్ష పార్టీలన్నీ నితీష్ కుమార్‌కే మద్దతు పలికాయి. దీంతో బిజెపి కూడా వెనక్కి తగ్గింది.
భాజపా గేమ్‌ప్లాన్ బహిర్గతమైంది-నితిష్
బిహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ రాజీనామా అనంతరం జేడీయూ నేత నితీశ్‌కుమార్ విూడియాతో మాట్లాడారు. భాజపా రాజకీయాలను అడ్డుకునే ధైర్యం ఉంది… ఇలాంటి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. భాజపా గేమ్ ప్లాన్ బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. మాంఝీ బలపరీక్ష, రాజీనామా అన్నీ భాజపా గేమ్ ప్లాన్‌లో భాగమేనన్నారు. భాజపా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జితన్‌రామ్ రాజీనామా అనంతర పరిణామాలపై ఇప్పుడే మాట్లాడలేమని నితీశ్ కుమార్ అన్నారు. జేడీయూ గవర్నర్ త్రిపాఠి తమ ప్రతిపాదనపై ముందు సానుకూలంగానే స్పందించారు. కానీ కొద్ది రోజుల్లోనే మార్పులు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. మాంఝీ రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని విషయాలు విూడియాతో చెబుతానని పేర్కొన్నారు. మరో నేత కేసీ త్యాగి మాట్లాడుతూ… తమకు మెజార్టీ ఉందని మొదట్నుంచి చెబుతున్నామన్నారు. సంఖ్యా బలం లేకే మాంఝీ రాజీనామా చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్… నితీశ్‌ను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సంఖ్యా బలం లేకనే జితన్ రాం మాంఝీ సీఎం పదవికి రాజీనామా చేశారని జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజార్టీ తమకు ఉందని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్‌కుమార్‌ను గవర్నర్ ఆహ్వానిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఇక బీహార్ రాజకీయాల్లో ఒక వర్గం కోపంతో ఉంటే.. మరో వర్గం సంబురాల్లో మునిగి తేలింది. ముఖ్యమంత్రి పదవికి జితన్ రాం మాంఝీ రాజీనామా చేయడంతో నితీష్‌కుమార్ వర్గం ఎమ్మెల్యేలు సంబురాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఆవరణలో జేడీయూ ఎమ్మెల్యేలు సందడి చేశారు. మాంఝీ మద్దతుదారులు నితీష్ రాజకీయాలపై కన్నెర్ర జేస్తున్నారు.