బాంబు పేలుళ్ల మృతులకు ఎడారి దేశంలో నివాళి

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ ఘటనపై ఈటీసీఏ దిగ్భ్రాంతిశ్రీకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు
దుబాయి, (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అరాచక శక్తులు ప్రయోగించిన బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారికి ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ) నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక వించెస్టర్‌ హోటల్‌లో నిర్వహించిన సంతాప సభలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, లేబర్‌ కౌన్సెలిర్‌ ఎంపీ సింగ్‌, ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్‌, ఏపీ ప్రభుత్వ డెప్యూటీ సెక్రెటరీ రామరాజు, సంఘ సేవకురాలు ఉమ పాడి, న్యాయవాది అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, విద్రోహ చర్య ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధితుల పక్షాన ఉంటుందని తెలిపారు. వరుస బాంబు పేలుళ్లతో దేశంలో భయానక పరిస్థితులు కల్పిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాడి దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు కల్పిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఎల్లవేళలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర కిరణ్‌కుమార్‌ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన నివేదిక సభముందుంచారు. కార్యక్రమంలో ఈటీసీఏ సభ్యులు మామిడి శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాల రాజ్‌పాల్‌రావు, చింతం రాజమల్లు, మంచుకొండ వెంకటేశ్వర్లు, కొండం అశోక్‌రెడ్డి, పీచర వెంకటేశ్వర్‌రావు, రాదరపు సత్యం, జయచందర్‌రావు, శ్రీనివాస్‌, స్వామి, నసీర్‌, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.