బాధితులకు తిండైనా పెట్టరా?

బాబు నిర్వేదం
హైదరాబాద్‌/న్యూఢల్లీి, జూన్‌ 23 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు కనీసం తిండైనా పెట్టరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన ఢల్లీిలోని ఏపీ భవన్‌లో బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో సంభవించినన వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడ ఆర్మీ చేస్తున్న కృషిని చంద్రబాబు అభినందించారు. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది శూన్యమని అన్నారు. ఉత్తరాఖండ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వరదల్లో రాష్ట్రం నుండి వెళ్లిన భక్తులు ఎంతమంది చిక్కుకుపోయారో ప్రభుత్వం నిర్దుష్టమైన లెక్కలు చెప్పలేకపోతున్నదని అన్నారు. అంతేకాక రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ఈ సంఘటనపై స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన వరద బీభత్సంలో తెలుగు ప్రజలు చాలా మంది చిక్కుబడి పోయారని అన్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడిరదని కేంద్రమంత్రి షిండే చెప్పడం సిగ్గుచేటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని పరామర్శించేందుకు తాను సోమవారం బయలుదేరి వెళ్తున్నానని బాబు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున జాతీయ విపత్తు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఉత్తరాఖండ్‌కు వెళ్లనుందని తెలిపారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ఢల్లీిలో ఒక ప్రత్యేక  కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు దేశ ప్రజలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన మంత్రి ఒక్కరు తప్పనిసరిగా ఉత్తరాఖండ్‌లో అక్కడి పరిస్థితిని సమీక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను విమానాల్లో రాష్ట్రానికి తరలించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.