బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

దర్యాప్తు జరుగుతోంది
దాడుల వెనుక ఎవరున్నది ఇప్పుడే చెప్పలేం : షిండే
ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) : బాంబు పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డవారి కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శుక్రవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటన స్థలిని ఆయన పరిశీలించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌ వచ్చారు. షిండే వెంట గవర్నర్‌ నరసింహన్‌,  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ¬మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. పేలుళ్ల ఘటనపై వివరాలను షిండే పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన క్షణ్నంగా పరిశీలించారు. నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేలుళ్లలో 14 మంది మృతి చెందగా, 119 మంది గాయపడినట్లు తెలిపారు. కేర్‌ ఆస్పత్రిలోని బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని షిండే పేర్కొన్నారు. బాధితులకు వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. పేలుళ్ల ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోందన్నారు. దీనిపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించిందని షిండే తెలిపారు. దాడుల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. రెండు, మూడు రోజుల కిత్రమే రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించామని, కాని ఒక ప్రాంతంలో జరుగుతుందని చెప్పలేదని, ఈ ఘటనలో పోలీసులు వైఫల్యంపై విచారణలో తేలుతుందని తెలిపారు. పేలుళ్ల ఘటనపై పార్లమెంటులో ప్రకటన చేస్తామని ¬ంమంత్రి షిండే ప్రకటించారు. ఘటనాస్థలిని పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించిందని తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతుందని చెప్పారు. దర్యాప్తులో అన్ని వివరాలు బయటపడతాయని వెల్లడించారు. ఈ ఘటన పోలీసుల వైఫల్యంతో జరిగిందా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. గురువారం రాత్రి సంఘటన జరిగిన వెంటనే  సుశీల్‌కుమార్‌ షిండే రంగంలోకి దిగారు. ప్రధాని ఆదేశాల మేరకు షిండే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌చేసి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంతో పాటు హైదరాబాద్‌ రహదారులన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని, హై అలర్ట్‌ ప్రకటించి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. మరణాల సంఖ్య పెరుగకుండా చూడాలని అవసరమైన వైద్య సహాయాన్ని తక్షణమే అందేలా చూడాలని ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే వెంటనే నివేదించాలని కూడా ఆయన సీఎంకు సూచించారు. సంఘటన వెనుక ఎవరున్నారనే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, నిఘా విభాగాలన్నింటిని రంగంలోకి దింపాలని ఆయన సీఎంకు సూచించారు.