బాబు తెలంగాణలో అడుగుపెడితే..  ప్రాజెక్టులు పడుకున్నట్లే


– అందుకే ఓసారి ఆ భూతాన్ని నేను తరిమికొట్టా
– ఇప్పుడు తరిమికొట్టాల్సిన బాధ్యత విూదే
– కూటమి అధికారంలోకి వస్తే చీకటి బతుకులు మళ్లీ వస్తాయి
– ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి
– సంక్షేమ పాలన కావాలంటే మళ్లీ తెరాసను గెలిపించుకోవాలి
– ఉమ్మడి పాలమూరులో 14కు14 స్థానాలు గెలిపించుకోండి
– 20లక్షల ఎకరాల్లో సాగునీరు పారిస్తా
– జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌
మహబూబ్‌నగర్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : తెలంగాణను పట్టుకొని పీడిస్తానని, వదల బొమ్మాళి వదలా అంటూ చంద్రబాబు అంటున్నాడని, అలా అన్నందుకే నును ఓసారి తరిమేశానని, ఇప్పుడు మళ్లీ కూటమి పేరుతో కాంగ్రెస్‌తో జతకట్టి వస్తున్నాడని, ఇప్పుడు తరమాల్సిన బాధ్యత విూదేనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నాలుగు సంవత్సరాలుగా ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తూనే ఉన్నారని సీఎం అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పాలమూరులో 90శాతం పూర్తి చేసుకున్నామని, ఇంకా కొంచెం పూర్తి కావాల్సి ఉందన్నారు. పాత పాలమూరు జిల్లాలో 8.50లక్షల ఎకరాలకు నీరు పారించుకుంటున్నామన్నారు. ఫలితంగా వలసల వాపస్‌ వస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. కచ్చితంగా పాలమూరు కరువు తీరాలని, ఉద్యమ కాలం నుంచి లక్ష్మారెడ్డి నా వెన్నంటే ఉండి పట్టుదలతో పనిచేస్తున్నారన్నారు. కోటి ఎకరాల తెలంగాణగా మార్చుకోవాలని ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పాత పాలమూరులో 20లక్షల ఎకరాలు సాగులోకి రావాలని, ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో 1.50లక్షల పైచిలుకు సాగులోకి రావాలని ఉద్దండాపూర్‌ వద్ద రిజర్వాయర్‌ పూర్తి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపూర్‌, కొడంగల్‌లతో పాటు తదితర ప్రాంతాలకు సాగునీరు వస్తుందన్నారు. చంద్రబాబు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, మిమ్మల్ని వదల బొమ్మాలి అంటున్నాడని, నేను ఒకసారి తరిమికొట్టానని, ఇప్పుడు తరిమికట్టే బాధ్యత విూదేనని కేసీఆర్‌ అన్నారు. పాలమూరు జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు ఏమొఖం పెట్టుకొని పోటీచేస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి మహబూబ్‌నగర్‌ జిల్లా దత్తత తీసుకున్నామన్నారని, కానీ తొమ్మిదేళ్లు పాలమూరుకు చేసింది ఏవిూలేదని కేసీఆర్‌ మండిపడ్డారు. నాలుగేళ్లలో మనం నెట్టెంపాడుతో పలు ప్రాజెక్టులు చేపట్టామని, చంద్రబాబు తొమ్మిదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దని ఢిల్లీ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన చంద్రబాబు ఏం మొఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతారో చెప్పాలని, ప్రజలంతా నిజానిజాలు ఆలోచన చేయాలని, పాలమూరు ప్రాజెక్టులు కానివ్వం, నీరు రానివ్వం.. అయినా సైకిల్‌కే ఓట్లు గుద్దాలని అంటే మనమేమైనా గొర్రెలమా అని ఆలోచించుకోవాలని  కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి దూరి విూ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి పోతా అంటున్నాడని, చంద్రబాబు వచ్చిన నాడు కచ్చితంగా నిలదీసి అడంగండి, కాంగ్రెస్‌ నాయకులను కూడా నిలదీయండని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌, దేవరకంద్ర, నాగర్‌కర్నూల్‌లలో నిలబడ్డ కాంగ్రెస్‌ అభ్యర్ధులు కోర్టులకు వెళ్లి కేసులు వేశారరని, ప్రాజెక్టులు అడ్డుకొనే ప్రయత్నం చేశారని అన్నారు.  వారిని తరిమికొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 20ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి
పోరాడుతున్నానని, ఈ ఎన్నికల్లో విూ బుజం కలిపి తనతో కలిసి  రావాలని కేసీఆర్‌ కోరారు. మనకు అర్థమైనా అర్ధంకానట్లు ఉంటే.. మన బతుకులు ఆగమవుతాయని, అర్థమైన వారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. 2001లో ఉద్యమం ప్రారంభించిన నాడు.. ఉద్యమం జెండాను దించను.. తెలంగాణ వచ్చే వరకు విరమం చెందను అని అన్నానని, జెండా వదిలితే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పానన్నారు. పట్టుదలతో తెలంగాణ సాధించుకున్నామని, దానిని బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ జితేందర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇతరలు నా దగ్గరకు పాలమూరుకు రూ.35వేల కోట్లు మంజూరు కావాలని ఇప్పించుకొని ప్రాజెక్టులు నిర్మాణం చేయిస్తున్నారన్నారు. 14నియోజకవర్గాల ప్రజలకు పాలమూరు 14కు 14సీట్లు గెలిపించాలని, 20లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే వికలాంగకు 3వేలు పెన్షన్‌, నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి కింద 3వేలు ఇస్తామని అన్నారు. 24గంటలు ఫ్రీ కరెంట్‌ ఇస్తున్నామని, రైతులకు ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకుంటున్నారని అన్నారు. రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి రూ. 8వేలకు వచ్చే ఏడాది నుంచి రూ. 10వేలు ఇస్తామని అన్నారు. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా విూ ఇళ్లకే అధికారులు వచ్చి రైతుబంధు చెక్కులు అందించారని, ఇలాంటి చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు రూ. 2వేలు ఇస్తామన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి నాకు కుడిభుజంగా ఉన్నారు. పాలమూరు జిల్లా ప్రజలు, మేదాలు ఆలోచించాలని అన్నారు. దేశంలో ఎక్కడాలేని అనేక స్కీంలను తీసుకొచ్చాం, 43వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కోసం అద్భుతమైన స్కీంను రూపకల్పన చేశామని కేసీఆర్‌ అన్నారు. మోసపోతే గోసపడతం, కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ కరెంట్‌ కష్టాలు మొదలవుతాయని అన్నారు. 30ఏళ్లు ఏడ్పించారు, నా మోటార్లు కూడా కాలిపోయాయి.. ధర్నాలు చేశాం కరెంట్‌ ఇవ్వలేదన్నారు. ఆంధ్రా సీఎంలు విూకు పరిపాలన చేయరాదన్నారు. వాళ్ల పరిపాలనలో పొలాలు ఎండిపోయాయని, మన పాలనలో ఆనాడు కరెంట్‌ ఉంటే వార్త.. నేడు పోతే వార్తగా పాలిస్తున్నామన్నారు. ప్రజలంటే కాంగ్రెసోళ్లకు ఓట్లు మాత్రమే కనిపిస్తాయని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి వెలుగు లాంటి పథకాలను ఎందుకు ఆలోచన చేయలేదో కాంగ్రెసోళ్లు చెప్పాలన్నారు. కులానికి, మతాలకు అతీతంగా మనం పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. చెవి, ముక్కు, పళ్లకు సంబంధించి కూడా ప్రతీ గ్రామానికి వస్తాయని, ప్రజలకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఒక్కరి బ్లడ్‌ తీసుకొని, తెలంగాణ ప్రజల హెల్త్‌ స్టేటస్‌ను తయారు చేస్తామన్నారు. ఎక్కడో శ్రీశైలం నుండి నీరు తీసుకొచ్చి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీరిచ్చే అద్భుత కార్యక్రమం మిషన్‌ భగీరథ చేపట్టామన్నారు. మరో నెల రోజుల్లో ప్రతీ ఇంటికి నల్లా ఇస్తామన్నారు. గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం ఇలాంటి పథకాలను ఎక్కడా పట్టించుకోలేదన్నారు. లక్ష్మారెడ్డి అద్బుతంగా పని చేశారని, ఈ దఫా కూడా లక్ష్మారెడ్డిని ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శివకుమార్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.