బాబ్రీ విధ్వంసంలో అద్వానీపై ఎందుకు ఉదాసీనత సీబీఐని నిలదీసిన సుప్రీం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌2 (జనంసాక్షి):  బాబ్రీ మసీద్‌ విధ్వంసం కేసులో బిజెపి నేత ఎల్‌కే అద్వాని తదితరులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎందుకు అపీల్‌ చేయలేదంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, తదితరులపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సవాలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సిబిఐ పైకూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకింత జాప్యం చేస్తున్నారంటూ సిబిఐని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ న్యాయాధికారి రెండువారాలలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేసు వివరాలను కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై అపీల్‌ చేసేందుకు జరుగుతున్న జాప్యంపై వివరించింది. ఇందుకోసం రాసిన ముసాయిదా సోలిసిటర్‌ జనరల్‌, అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ వద్ద వారి అభిప్రాయాలతో పాటు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. జాప్యమంతా వారిదే. సంబంధిత వ్యక్తులు ఈ కేసులో జాప్యాన్ని అర్థం చేసుకునేలా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మీరే అఫిడవిట్‌ వేయండంటూ కోర్టు సూచించింది.