బాబ్లీని కూల్చాల్సిందే అఖిలపక్షంతో సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి):
నది జలాల అంతర్ రాష్ట్ర ఒప్పందా లకు విరుద్దంగా, గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కట్టడాన్ని పూర్తిగా తొలగించ డానికే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉందని రాష్ట్ర భారీ, మధ్యత రహానీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై అక్టోబర్-16న, గౌరవ సుప్రీమ్ కోర్టులో చివరి విడుత వాదనలు జరుగనున్న నేపధ్యంలో మంత్రి తన పేషిలో అఖిలపక్ష నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అనిల్‌కుమార్, తెలుగుదేశం తరపున శాసనసభ్యులు మాండవ వెంకటేశ్వర్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, టిఆర్‌ఎస్ తరపున బి.వినోద్‌కుమార్, విద్యాసాగర్‌రావు, సిపిఐ తరపున చాడవెంకట్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి యస్.కె.జోషి, ఇ-ఎస్-సి.లు నారాయణరెడ్డి, మురళిధర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతవరకు సుప్రీమ్ కోర్టులో బాబ్లీ ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన వాదనలను మంత్రి అఖిలపక్ష నాయకులకు వివరించారు. ఇదే విషయమై అఖిలపక్ష నాయకులు పలు సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సచివాలయంలోని తన కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కొరకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తున్నదని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును అక్రమంగా నిర్మించినందున దాన్ని తొలగించాల్సిందేనని అన్నారు. కేవలం మహారాష్ట్ర తమ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాల కొరకే 2.74టియంసిల సామర్ధ్యంతో బాబ్లీ నిర్మించానని వాదించడం అర్థం లేనిదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఇలాగే కొనసాగితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి 1069.50, 1091.00 అడుగుల మధ్య 65 టియంసిల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది నుండి మహారాష్ట్రకు ఇవ్వడానికి సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. బాబ్లీ నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తే ప్రాజెక్టును కూల్చుతామనే మహారాష్ట్ర వాదనను పాత్రికేయులు మంత్రి దృష్టికి తేగా, ఆ వాదనకు అర్థం లేదని మంత్రి కొట్టివేశారు. మహారాష్ట్ర భూభాగంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉమ్మడి యాజమాన్య నీటి నియంత్రణ అధికార మండలి ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టను మూమ్మాట్టికి కూల్చాల్సిందేనని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.