బాబ్లీపై ఢిల్లీలో న్యాయపోరు

అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకువెళ్లేందుకు అంగీకారం
విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌
అన్యాయం జరుగుతుంది, రెవ్యూ పిటిషన్‌ వేయాల్సిందే: విపక్షాలు
హైదరాబాద్‌, మార్చి 28 : బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు అఖిలపక్ష సమావేవం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతర పరిణామాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. సుప్రీం తీర్పుతో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నందునా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అయితే 60 టీఎంసీల గోదావరి జలాలను మాత్రమే మహారాష్ట్ర వాడుకోవాలని, బాబ్లీ కోసం 2.74 టీఎంసీల నీరును మాత్రమే వాడుకోవాలని సుప్రీంకోర్టు మహారాష్ట్రకు స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాక ముగ్గురు సభ్యులతో ఒక పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేసినందునా రాష్ట్ర ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగబోదని ఆయన వివరించారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగితే సహించేదిలేదని కూడా ఆయన సమావేశంలో వివరించినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల విపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. సుప్రీం తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందని, దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాల్సిందేనని పట్టుపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేవలం బాబ్లీ ప్రాజెక్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించే 11 ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నెల 26న ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సభ్యులు సిద్ధమయ్యారు. అయితే సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానుందనా తాము భేటీలో పాల్గొనబోమని విపక్షాలు మంత్రి సుదర్శన్‌రెడ్డికి స్పష్టం చేశాయి. అసెంబ్లీ తొలి విడత సమావేశాలు అదే రోజు ముగియడంతో ముఖ్యమంత్రి ఈ భేటీకి హాజరుకాలేకపోయారు. దీంతో సమావేశాన్ని నేటికి వాయిదా వేశారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరఫున వినోద్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, వైఎస్సార్‌ సీపీ తరఫున కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, సంకినేని, సీపీఎం తరఫున సారంపల్లి మల్లారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ తరఫున గుండా మల్లేశ్‌, కూనంనేని సాంబశివరావు, బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, శేషగిరిరావు, ఎంఐఎం మహ్మద్‌ జాఫ్రీ, టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, విజయరమణారావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు తదితరులు హాజరయ్యారు.