బాబ్లీపై బెంగలేదు

రివ్యూ పిటిషన్‌ అక్కర్లేదు : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) :
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతుతో రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టులో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2.70 టీఎంసీల నీటినే వాడుకోవాలని, అంతకు మించి చుక్కా నీటిని వాడుకునే అవకాశం లేదన్నారు. సుప్రీం తీర్పులో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. ప్రాజెక్టుపై ఏర్పాటు చేసే హైపవర్‌ కమిటీ నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర నీటి చౌర్యానికి పాల్పడే అవకాశం ఉండబోదన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని దీనిని మానుకోవాలని హితవు చెప్పారు. తానైతే సుప్రీం తీర్పుతో సంతృప్తికరంగా ఉన్నానని దీనిపై ఎలాంటి రివ్యూ పిటిషన్‌ వేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుపై ఎవరూ అనవసర రాద్ధాంతం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని సీఎం అన్నారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామంటూ బాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని స్పష్టం చేశారు.
కిరణ్‌లో అదే నిర్లక్ష్యం: బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారబోతోంది అంటూ రైతాంగం ఆందోళన చెందుతుంటే వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పూర్తి నిర్లక్ష్యంగా మాట్లాడారు. కేవలం 2.70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుగానే ఆయన బాబ్లీని చూస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్టును ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో నిర్మించడం, గ్రావిటీతో ప్రాజెక్టులో తక్కువ నీరు ఉన్నప్పుడు ఎస్సారెస్పీలోని నీరు బాబ్లీవైపు వెళ్లనుందనే విషయాన్ని విస్మరించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటలను ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఉన్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి నిర్ధారించేలా మాట్లాడటాన్ని ఇక్కడి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము నిండా మునుగుతున్నా పాలకులు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతురా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.