బాలికలపై వివక్ష వద్దు
– అమితాబ్
దిల్లీ ,మే28(జనంసాక్షి):ఎన్డీయే పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘ఏక్ నయీ సుబహ్’ పేరిట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏకధాటిగా 5 గంటలపాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎన్డీఏ పాలనలో విజయాలు, పథకాలను కేంద్రం వివరించనుంది. ఈ కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ బేటీ బచావో, బేటీ పడావో పథకాలపై చిన్నారులతో ముచ్చటించారు. కార్యక్రమంలో పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు అమితాబ్ సమాధానమిచ్చారు.
బాలికలపై వివక్షత చూపకండి: అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపట్టిన ‘ఆడపిల్లలని సంరక్షిద్దాం.. ఆడపిల్లల్ని చదివిద్దాం'(బేటి బచావో-బేటి పడావో) పథక అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో ఓ ఎన్‌జీవోకి చెందిన చిన్నారులు పాల్గొన్నారు. వారితో బిగ్ బి మాట్లాడుతూ చిన్నారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా బిగ్ బి మాట్లాడుతూ ‘ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఎంతో కీలకమని.. అబ్బాయి, అమ్మాయి అనే వివక్షత చూపించి ప్రవర్తించకూడదన్నారు. బాలిక అనే వివక్షతను చూడొద్దు.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చూడండి.. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎంతో ధైర్యసాహసాలు కలిగి ఉన్నార’ని బిగ్ బి అన్నారు. బాలీవుడ్ నటులు రవీనా టాండన్, జుహీ చావ్లా, కైలాశ్ ఖేర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అంగన్వాడీ కార్యకర్తలకు ట్యాబ్లెట్లు
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు ట్యాబ్లెట్లు అందజేయనున్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖమంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఎన్డీఏ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘ఏక్ నయీ సుబహ్’ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను రక్షించేందుకు 1098 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత 500 పట్టణాల్లో చిన్నారుల కోసం ఈ నంబర్‌ను అమలు చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇంద్రధనుస్సు ద్వారా పిల్లలకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పిల్లలకు ఏడు రకాల టీకాలు వేయిస్తున్నట్లు చెప్పారు. రోటా వైరస్ టీకాతో పిల్లలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.