బాలికల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు మూలం రక్తహీనత — మండల వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్

 

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): టేకులపల్లి లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్థానిక మండల వైద్యాధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 36 మంది బాలికలకు చికిత్సను శనివారం అందించారు. అనంతరం ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత ఏర్పడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యాధికారి తెలుపుతూ రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు చదువు, ఆటల్లో ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత,నీరసం చిన్నపనికే అలసిపోవడం, ఆయాస పడడం,చర్మం పారిపోయినట్లు ఉండడం,కాళ్లు చేతులు లాగడం, గుండెకు సరిపడినంత రక్తం అందక చాతిలో నొప్పి, కళ్ళు తిరగడం, తినకూడని పదార్థాలు తినాలనిపించడం అనగా మట్టి, సున్నం,చాక్ పీసులు,ఐస్ గడ్డలు తినాలనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి యుక్త వయసులో ఉన్న బాలికలు రోజువారి ఆహారంలో చక్కటి తాజా ఆకుకూరలు ముఖ్యంగా గోంగూర,పాలకూర,బచ్చలి కూర, కరివేపాకు, ఉల్లికాడలు, పుదీనా, బీట్ రూట్, ఎండు ఖర్జూర, అరటి, గుడ్డు,పాలు,మాంసాహారం ముఖ్యంగా లివర్, బెల్లం, సజ్జలు, రాగులు, అటుకులు, మరమరాల్లో అధిక మోతాదుల్లో ఇనపదాతువు లభిస్తుందని ఇనుప పాత్రలలో తయారుచేసిన వంటల ద్వారా కూడా ఇనపదాతు లభిస్తుందని పై ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా విటమిన్ లభించే ఆహార పదార్థాలైన పుల్లటి ఉసిరి, దానిమ్మ,నారింజ,నిమ్మ వంటి పండు కూడా తీసుకోవాలని తద్వారా తీసుకున్న ఇనుప దాతువుని శరీరము గ్రహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంతు,నాగమణి, ఏఎన్ఎం సీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.