బాసరవద్ద గోదావరి పరవళ్లు
తొలకరితో తొలిసారిగా గోదావరికి వరద
కడెం ప్రాజెక్టులోకీ భారీగా వరద
నిర్మల్,జూన్12(జనం సాక్షి): గతసంవత్సరం వర్షాభావ పరిస్థితులతో బాసర వద్ద ఎండిపోయిన గోదావరి నది మళ్లీ తొలకరితో జలకళ సంతరించుకుంది. బాబ్లీ నుంచి వదిలిన నీరు సాయంత్రానికి బాసరకు చేరుకోవటంతో నది వరదనీటి ప్రవాహంతో ఉరకలెత్తింది. ఇన్నాళ్ళు భక్తుల పుణ్యస్నానాలకు నీరు లేని నదిలో నీటి ప్రవాహం పెరగటంతో స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. నదిలో నీటి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో బాసర మండల రెవెన్యూ, పోలీసు అధికారులు నదితీరంలో అప్రమత్తత ప్రకటించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా ఉంటాయనే అంచనాలను తొలకరి వర్షాలు నిజం చేస్తున్నాయి.నాలుగైదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షానికి రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కరవు తీరా వానలు కురిసి తమ కష్టాలను దూరం చేస్తాయని కోటి ఆశలతో సాగుబాట పట్టాడు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలో గోదావరి నదికి వరద వస్తుంది. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిర్మించిన అనంతరం వరద ఎక్కువగా ఆ రెండు మాసాల్లోనే నమోదైంది. ప్రాజెక్ట్ చరిత్రలో తొలిసారిగా జూన్ రెండవ వారంలో వరద నమోదైంది. మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు బాబ్లీ ప్రాజెక్ట్ నిండిపోయింది. రెండున్నర టీఎంసీల నిల్వ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండటంతో సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్‌కు చెందిన నాలుగు గేట్లను ఎత్తి సుమారు లక్ష క్యూసెక్‌ల నీటిని దిగువకు వదిలారు. సమృద్దిగా కురిసిన వర్షాలతో 20 రోజులు ముందుగానే గేట్లను ఎత్తి నీటి విడుదల చేశారు. పిల్ల కాలువలు, కుంటాల నుంచి వరదతోపాటు భారీ వర్షాలతో గోదావరిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టు నిండడంతో అక్కడి అధికారులు సోమవారం నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సుమారు లక్ష క్యూ సెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో బాసర వద్ద గోదావరి ఉరుకులు పరుగులు పెడుతూ నిండు కుండలా తలపిస్తోంది. ఇకపోతేకడెం జలాశయంలోకి వరద మూడు రోజులుగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి మరింత వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇచ్చోడ, బోథ్, నేరేడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, కుంటాల, కుప్టి, చీక్‌మాన్ ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు వచ్చి చేరుతోంది. ఇకపోతే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణ సవిూపంలోని గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్టులోకి క్రమ క్రమంగా వరద వచ్చి చేరుతోంది. గతేడాది అంతంత మాత్రన కురిసిన వర్షాలకు గడ్డెన్న ప్రాజెక్టులో నీరు అంతంత మాత్రమే ఉండేది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో జలకళ ఉట్టి పడుతోంది. ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే పరిస్థితులున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో పర్యాటకుల సందడి పెరిగింది.