బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి  రాజీనామా

బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో చెబుతానన్నారు.

మల్కాజ్ గిరి సీటుతో పాటు తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే మల్కాజ్ గిరి స్థానం ఒక్కటే మైనంపల్లికి కేటాయించారు సీఎం కేసీఆర్. తన కుమారుడు రోహిత్ కు మెదక్ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న మైనంపల్లి ఇవాళ రాజీనామా చేశారు. ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి రాజస్థాన్ వెళ్ళారు మైనంపల్లి. సెప్టెంబర్ 24న ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

ఇటీవల మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు మైనంపల్లి. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని అన్నారు. తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని హెచ్చరించారు. మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పోటీ చేస్తారని చెప్పారు.

ట్రంకు డబ్బా, రబ్బరు చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్..రాజకీయంగా ఎంతో మందిని అణిచి వేశావ్. మల్కాజ్ గిరిలో నేను పోటీ చేస్తాను. రాజకీయాలు పక్కన పెట్టైనా మెదక్ లో మా అబ్బాయిని ఎమ్మెల్యేను చేస్తా అంటూ ఘాటుగా స్పందించారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాను.. మైనంపల్లి హనుమంతరావు తలచుకుంటే ఏం జరుగుతుందో మంత్రి హరీశ్ రావును చూపిస్తానంటూ శపథం చేశారు. సిద్దిపేటలో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ ఘాటుగా స్పందించారాయన.