బీఆర్‌ఎస్‌కు గ్రౌండ్ రియాలిటీ తెలియదు
అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిగా బరిలోకి దిగారు..!
పార్టీని తప్పుదోవ పట్టించిన పలు సర్వే సంస్థలు
కండ్లకు గంతలు కట్టి కామారెడ్డిలో పోటీకి దింపారు
సర్వేలపైనే అతిగా ఆధారపడటంతో ఎన్నికల్లో తీవ్ర నష్టం
క్షేత్రస్థాయిలో ప్రజాభీష్టాన్ని ఒడిసిపట్టడంలో బీఆర్‌ఎస్ విఫలమైందనే చెప్పాలి. అతి విశ్వాసం, అన్ని అంశాల్లోనూ సర్వేలపైనే ఆధారపడటం ఆ పార్టీ కొంపముంచింది. ఎమ్మెల్యేల పనితీరు మొదలు టికెట్ కేటాయింపు, నియోజకవర్గాల్లో గెలుపోటముల వరకు సర్వేలపైనే పార్టీ ఫోకస్ పెట్టడం చివరకు తీవ్ర నష్టం చేకూర్చుంది. సెగ్మెంట్లవారీగా భౌతిక స్థితిగతులు తెలుసుకోలేకపోవడం, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను గుర్తించకపోవడం బీఆర్‌ఎస్ ఓటమికి ఓ కారణంగా అర్థమవుతోంది. ముఖ్యంగా పలు సర్వే సంస్థలు అశాస్త్రీయంగా చేపట్టిన ‘ప్రజాభిప్రాయాలు’ గులాబీ క్యాడర్‌ను తప్పుదోవ పట్టించాయి. కేసీఆర్‌ను కామారెడ్డిలో పోటీలోకి దింపాలనే నిర్ణయమూ దెబ్బతీసిందని స్పష్టమైంది.
హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) :గడిచిన క్రికెట్ వరల్డ్ కప్‌లో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా తుది పోరాటంలో బొక్కాబోర్లా పడ్డట్టుగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భంగపడటాన్ని అధిష్టానం, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల రోజులు గడిచిపోతున్నా ఇప్పటికీ ఓటమి ప్రభావం వారిని వెంటాడుతున్నట్టు ఆ పార్టీ సమావేశాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కిమ్మనని నేతలు కూడా స్వరం పెంచి మాట్లాడుతున్నారు. పేరు మార్పు, పక్క రాష్ట్రాలకు సమయం కేటాయించడం పార్టీని గెలుపును దూరం చేయడం ఒక అంశమైతే.. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోలేకపోవడం బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది. కొన్ని సంక్షేమ పథకాల విషయంలో బీఆర్‌ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు అనుయాయులకే తప్ప అసలైన లబ్దిదారునికి చేరకపోవడం ఆగ్రహావేశాలకు కారణమైంది. సుమారు 12వేలకుపైగా గ్రామ పంచాయతీలున్న తెలంగాణలో కనీసం గ్రామానికో యూనిట్‌కు కూడా రాని పరిస్థితి. ఈ విషయంలో ఎదురైన ఇబ్బందులను బీఆర్‌ఎస్ సర్కారు, పార్టీ అధిష్టానం సరిగ్గా విశ్లేషించలేకపోయిందనే అభిప్రాయాలున్నాయి.
‘పరీక్ష’ల నుంచి ప్రాజెక్టులదాకా…
ధరణి పోర్టల్ వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న ఇబ్బందులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించడంలోనూ సా…గదీత కొనసాగింది. వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండిరగ్‌లో ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా సరైన సమయంలో రుణమాఫీ చేయకపోవడం అన్నదాతల్లో అసహనానికి కారణమైంది. ప్రధానంగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో లీకేజీల వ్యవహారం యువతలో వ్యతిరేకత తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు దెబ్బతినడం, దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం బీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపాయి.
సర్వేలతో పక్కదారి పట్టిన పార్టీ..!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ అధినేత, ఆ పార్టీ ఎక్కువగా సర్వేలపైనే ఆధారపడినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరు నుంచి అభ్యర్థుల ఎంపిక, టికెట్ కేటాయింపుల వంటి అంశాల్లో సర్వేల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల ముందునుంచే వెలువడిన పలు ప్రీ పోల్ సర్వేలు బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టు ప్రకటించాయి. కొన్ని సంస్థలు 60కిపైగా, ఇంకొన్ని సంస్థలు 70కి అటుఇటుగా, మరికొన్ని సంస్థలు 80కిపైగా అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ దక్కించుకోనున్నట్టు వెల్లడిరచాయి. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టుగా, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్టుగా పేర్కొన్నాయి. నిర్దిష్టంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా అశాస్త్రీయంగా సర్వేలు ప్రకటించాయి. వీటినే పరిగణలోకి తీసుకున్న బీఆర్‌ఎస్ పెద్దలు.. అతి విశ్వాసానికి పోయి పలు సమావేశాల్లోనూ తమకే అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రతిపక్షం బలంగా లేదని, అదే ఊపులో మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్టు భావించారు. హామీలు పక్కా నెరవేరుస్తామనే నమ్మకాన్ని కలిగించలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను ఆకట్టుకుని ఉన్న సమయంలోనే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లగలిగిందని పరిశీలకులు భావిస్తున్నారు.
(సర్వేల్లో ‘జనంసాక్షి’ శాస్త్రీయత
బీఆర్‌ఎస్ సర్కారుకు వీస్తున్న ఎదురుగాలిని ఎప్పటికప్పుడు గమనించిన ‘జనంసాక్షి’ వాస్తవాలను తెలుసుకునేందుకు శాస్త్రీయ కోణంలో సర్వేలోకి దిగింది. నోటిఫికేషన్ కంటే కొన్ని నెలల ముందే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలోనే రైతులకు రుణమాఫీ అందలేదనే అన్నదాతల ఆవేదనను తెలుసుకుని ‘జనంసాక్షి’ కథనాన్ని ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎట్టకేలకు రైతు రుణమాఫీ చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనంతరమూ తెలంగాణవ్యాప్తంగా ముమ్మరంగా సర్వే చేపట్టి బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు రాబోతున్నాయో ముందే విశ్లేషించింది. ఓటమి ఖాయమని స్పష్టం చేసింది. ‘జనంసాక్షి’ వెల్లడిరచిన సర్వే ఫలితాలే వాస్తవితకు అద్దం పట్టాయి.