బీజేపీకి యెడ్యూరప్ప గుడ్‌బై కన్నీటి పర్యంతమైన యెడ్డీ

శాసనసభ్యత్వానికి రాజీనామా

కర్ణాటక జనతాపార్టీపేరుతో కొత్తపార్టీ

 

బెంగళూరు, నవంబర్‌ 30: కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యెడ్యూరప్ప ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అసెంబ్లీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన మద్దతు దారులతో విధాన సౌధకు చేరుకున్న యెడ్యూరప్ప శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తన జీవితాన్ని ధారపోశానని, రాష్ట్రంలోని కొందరు నాయకులు తాను ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టంలేక గద్దె దించారని కన్నీళ్లుపెట్టుకున్నారు. రాష్ట్రంలోని పార్టీ నేతల కారణంగానే పార్టీని వీడుతున్నానని, డిసెంబర్‌ 9న కొత్తపార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యెడ్యూరప్ప దక్షిణాదిన తొలి బీజేపీ ప్రభుత్వంగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. ఆయన రాజీనామాతో కర్ణాటకలో బీజేపీకి దిక్కుతోచని పరిస్థితేనని చెప్పాలి. అయితే పార్టీ నేతలు మాత్రం యెడ్యూరప్ప రాజీనామా ప్రభావం పార్టీపై ఏమీ ఉండదని భింకంగా చెబుతున్నారు. యెడ్యూరప్పకు కనీసం 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నా యెడ్యూరప్ప మాత్రం ఇప్పుడే రావొద్దని కోరుతున్నారు. అదేవిధంగా డిసెంబర్‌ 9న జరిగే పార్టీ ప్రారంభోత్సవానికి కూడా హాజరుకావొద్దని ఆయన మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఎందుకంటే బీజేపీ తీసుకునే క్రమశిక్షణ చర్యల వల్ల వీరు పార్టీకి రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోకతప్పదు. అవినీతి ఆరోపణల కారణంగా 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన యెడ్యూరప్ప ఆనాటి నుంచి కూడా బీజేపీపై ఆగ్రహంతో ఉండటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు సంక్షోభాలను కూడా సృష్టించారు. కనీసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానైనా నియమించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వం పట్టంచుకోపోవడంతో చివరకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయంచుకున్నారు. పార్టీని వీడవద్దని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, సీనియర్‌ నేతులు అరుణ్‌జైట్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయంగా తన మనుగడ ప్రశ్నార్థకం కావడంతో ఆయన చివరకు కొత్త పార్టీ స్థాపనకు ఉపక్రమించారు. 70 ఏళ్ల యెడ్యూరప్ప 1972లో ఆనాటి జన్‌సంఘ్‌ తరఫున శికారిపురి తాలూకా అధ్యక్షుడిగా రాజీకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పాఠాన్నే అధిరోహించారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ పార్టీ అయిన బీజేపీలో లింగాయత్‌ నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నప్పటికీ రాష్ట్ర నేతల్లో నెలకొన్న వర్గపోరు కారణంగా కన్నతల్లి లాంటి బీజేపీ ఒడిని కన్నీటి పర్యంతమవుతూ వీడారు.