బీజేపీకి రాహుల్‌ చురక

న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి ఆమెను తనయుడే తోడ్కొనిపోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ గాంధీనే వెల్లడించారు.వార్షిక వైద్యపరీక్షల కోసం అమ్మను ఆస్పత్రికి తీసుకెళుతున్నాను. కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. బీజేపీ ట్రోలింగ్‌ ఆర్మీకి నాదొక సూచన. నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరంలేదు. అతి త్వరలోనే తిరిగొస్తాను’ అని రాహుల్‌ రాసుకొచ్చారు. గతంలో చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోవడం, ఎక్కడున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా రోజులకు రోజులు గడపడం లాంటివి రాహుల్‌ అలవాట్లుగా ఉండటం, ఆయా సందర్భాల్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శల దాడి చేయడం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రాహుల్‌ తన విదేశీ పర్యటన వివరాలను ముందే వెల్లడించారు. తల్లి సోనియాను తీసుకుని రాహుల్‌ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు బయలుదేరి వెళతారని, వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగొస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణకు సంబంధించి రాహుల్‌ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాహుల్‌ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారని, మాంద్‌సౌర్‌ రైతులపై కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్‌6న రైతు కుటుంబాలను రాహుల్‌ కలవనున్నారు.