బీజేపీ, జేడీయూ బాహాబాహీ

బీహార్‌ బంద్‌ ఉద్రిక్తం
పలువురికి గాయాలు
పాట్నా, జూన్‌ 18 (జనంసాక్షి) :
మొన్నటి వరకు కలిసి అధికారాన్ని అనుభవించిన బీజేపీ, జేడీయూ బీహార్‌లో బాహాబాహీకి దిగాయి. జేడీ(యూ) తీరును నిరసిస్తూ బీహార్‌లో బీజేపీ మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. బంద్‌ సందర్భంగా బీజేపీ`జేడీయూ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ ప్రభావం బాగానే కనిపించింది. 17 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పొత్తును అర్ధంతరంగా తెంచుకున్న జేడీయూ తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్నికల్లో బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించడంపై జేడీయూ తీవ్ర ఆగ్రహంతో జేడీయూ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మైత్రిని తెంచుకుంది. మోడీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నితీశ్‌.. రాష్ట్రంలోని బీజేపీ మంత్రులను బర్తరఫ్‌ చేశారు. జేడీయూ అనూహ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ఉదయమే రోడ్లపైకి వచ్చారు. బస్సులు, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. జాతీయ రహదారులు సహా పలు ప్రధాన రోడ్లను మూసివేశారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మతబడ్డాయి. బీజేపీ కార్యకర్తలు రాజధాని పాట్నాలో భారీ ఆందోళన కార్యక్రమాలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే, వీరి ఆందోళనలకు దీటుగా జేడీయూ మద్దతుదారులు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. ఇరు పార్టీల ర్యాలీలు ఎదురుపడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలకు నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు ప్రదర్శనలు చేపట్టగా, మరోవైపు, జేడీయూ మద్దతుదారులు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో పరిస్థితి ఘర్షణ వాతావరాణానికి దారి తీసింది. బీజేపీ కార్యకర్తలతో జేడీయూ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. ఘర్షణల్లో దాదాపు పది మంది ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌, మరో ముగ్గురు నేతలు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులను ఆందోళనకారులు మూసివేశారని చెప్పారు. రాజధానిలో బంద్‌ ప్రభావం మిశ్రమంగా కనిపించింది. నిత్యం రద్దీగా ఉండే అశోక్‌ రాజ్‌పథ్‌, బైలీ రోడ్‌, పాట్నా`దానాపూర్‌ రోడ్‌, ఫ్రేజర్‌ రోడ్‌లను ఆందోళనకారులు మూసివేశారు.