బీసీ స్టడీ సెంటర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీ పోతుగంటి రాములు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి):

యువత తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని, ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించి, తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు అన్నారు.బుధవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మంజూరైన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ స్టడీ సెంటర్ ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ ఆర్ట్స్ & కామర్స్ కళాశాలలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అదనపు కలెక్టర్ మను చౌదరి లతో కలిసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90 వేల ఉద్యోగ నోటిఫికేషన్లను దశల వారీగా విడుదల చేస్తుందని, ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా యువత అందుబాటులో ఉన్న సమయాన్ని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీసీ స్టడీ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.స్టడీ సెంటర్ ద్వారా విద్యార్థులకు అన్ని రకాల గ్రూప్ స్థాయి నాణ్యమైన శిక్షణ తోపాటు ఉచితంగా మెటీరియల్ను కూడా అందిస్తున్నామని, యువతకు యూనిఫామ్ కోర్సులలో శిక్షణ అందుతుందని అన్నారు.దేశం మనకే మిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏమి ఇచ్చామన్న ఆలోచనలతో యువత ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేసేలా ఉన్నత లక్ష్యాల వైపు యువత పయనించాలన్నారు.18 సంవత్సరాల నిండిన ప్రతి యువతి, పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించేలా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు.భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు.

జిల్లాను విద్యా హబ్బుగా మారుస్తున్నాం:
నాగర్ కర్నూల్ ఎంఎల్ఏ మర్రి జనార్ధన్ రెడ్డి.
మరో ముఖ్య అతిథి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…నాగర్ కర్నూల్ జిల్లాను విద్యా హబ్బుగా మారుస్తున్నామని, ప్రతి విద్యార్థి అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే సూచించారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో జేఎన్టీయూ తరహా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ల లో ఒక దాని పై ప్రత్యేక శ్రద్ధ వహించి , పూర్తి ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలన్నారు.మహనీయుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.కళాశాలకు కావలసిన రోడ్డుకు ఏర్పాటుకు ఎమ్మెల్యే నిధుల నుండి ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగాలు సాధించాలి:
అదనపు కలెక్టర్ మను చౌదరి.
అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ….
రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతుల విద్యార్థులు అభ్యున్నతికి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని, యువత ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగాలు సాధించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రూప్స్ ఉద్యోగాలతో పాటు సివిల్స్ పరీక్షల అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
ప్రణాళిక బద్ధంగా చదివితే ఉద్యోగాలు సాధించవచ్చని, తెలిపారు.కలలు కనడంతో పాటు వాటిని సహకారం చేసుకోవాలని, అందుకు సరియైన సమయపాలన పాటిస్తూ సిలబస్ కు అనుగుణంగా ప్రిపేర్ కావాలని ఆయన సూచించారు.
అనంతరం రెండు గంటల పాటు పోటీ పరీక్షలు, సివిల్స్ కు ఎలా సంసిద్ధం కావాలో కులంకషంగా వివరించారు.

అన్ని నియోజకవర్గాల్లో బిసి స్టడీ సెంటర్లు ప్రారంభం:
బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్.

అంతకుముందు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ మాట్లాడుతూ…
నాగర్ కర్నూల్ జిల్లాలో మొట్టమొదటిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీసీ స్టడీ సెంటర్ ను నేడు ప్రారంభించడం జరిగిందని రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గ పరిధిలో బిసి స్టడీ సెంటర్ ను త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మెన్ బాబురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, వైస్ ప్రిన్సిపల్ విజయ,బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి శ్రీధర్ జి, బిసి వెల్ఫేర్ అధికారులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.