బీసీ హాస్టల్ ను ఎత్తేస్తే ఊరుకోం

నంగునూరు, అక్టోబర్16(జనంసాక్షి):
బీసీ హాస్టల్ ను నంగునూరు నుండి ఎత్తేస్తే ఊరుకోమని అలాంటి ప్రయత్నం మానుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి హెచ్చరించారు.ఆదివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడరు.
మండల కేంద్రమైన నంగునూరులోని బిసి హాస్టల్ తరలింపును తక్షణమే విరమించుకోవాలని కలెక్టర్ కి గతంలోనే వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించి వసతి గృహాన్ని తొలగించమని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు.
నంగునూరు చుట్టుప్రక్కన గల 26 గ్రామాల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు గత 40 సంవత్సరాలుగా ఎంతో మందికి వసతి కలిపించి అన్నిరంగాలలో ఉత్తమ స్థానాలలో ఉండడానికి కారణమైన ఈ హాస్టల్ ను చడీ చప్పుడు కాకుండా సిద్ధిపేట వసతి గృహంలో విలీనం చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ హాస్టల్ ను ఏర్పాటు చేశారుకాబట్టె మంత్రి హరీష్ రావు ఓర్వలేక దీన్ని ఇక్కడి నుండి ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నాడనీ , తక్షణమే హాస్టల్ తరలింపు , విలీనం అంశాలను ఆపాలని హెచ్చరించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి దాపురించడం సిగ్గుచేటన్నారు.పేదల చదువులకోసం అన్నిరకాల వసతులు కలిపిస్తున్నామనే చెప్పేమాటలు ఉత్తవేనా అంటూ నిలదీశారు.పిల్లలు లేరనే సాకు చూపి వసతి గృహాన్ని తొలగించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించాల్సిన సదుపాయాలకు గొడ్డలి పెట్టులాంటి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.సరిపడా విద్యార్థులు లేకుంటే సంబంధిత అధికారులు చుట్టుపక్కల గ్రామాలలోకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి
ఖాళీలు భర్తీ చెయ్యాలని సూచించారు.ఇప్పటికైనా తరలింపు ప్రక్రియ అపకపోతే గ్రామస్తులతో,విద్యార్థులు , తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా  చేపడుతామనీ హెచ్చరించారు .
Attachments area