బీహార్‌ కోర్టు ఆవరణలో పేలుడు

4

ఇద్దరు మృతి

పాట్నా,జనవరి23 (జనంసాక్షి):  బీహార్‌ రాష్ట్రంలోని అరా కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, కానిస్టేబుల్‌ మృత్యువాత పడ్డారు. బాంబు పేలుడు ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. బరాక్‌ ఒబామా ఆదివారం భారత్‌ కు రానున్న నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. భారత్‌ లోకి నాలుగు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ హెచ్చరించిన మరుసటి రోజే బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బాంబు పేలుడు ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఒబామా పర్యటన సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల లక్ష్యం దిల్లీ కాకపోవచ్చని, కాశ్మీర్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో బాంబుదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒబామా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే హై అలర్డ్‌ ప్రకటించారు.