బీహార్‌ జేడీ(యు) శాసనసభాపక్ష నేతగా నితీష్‌

1

ముఖ్యమంత్రి జితన్‌ మాంఝీని పార్టీనుంచి బహిష్కరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి): బిహార్‌లో ఒక్కరోజులోనే రాజకీయ సవిూకరణలు వేగంగా మారాయి. బీహార్‌ ముఖ్యమంత్రి మాంఝీని రాజీనామా చేయాలని పార్టీ అధినేత శరద్‌యావ్‌ కోరటంతో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు జితన్‌రాం మాంఝీ తిరస్కరించారు. గత కొద్ది నెలలుగా మాంఝీ పార్టీ నాయకత్వంపై గుర్రుగా వున్న విషయం తెలిసిందే. రాజీనామా కోరిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన తీర్మానించారు. అయితే తీర్మానాన్ని ఏడుగురు మంత్రులు మాత్రమే బలపర్చగా 21 మంది మంత్రులు అంగీకరించలేదు. మరోవైపు జనతాదళ్‌ యునైటెడ్‌ శాసనసభ్యులు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు.

2014 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికార జనతాదళ్‌ యునైటెడ్‌ ఘోరంగా పరాజయం పాలయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో జనతాదళ్‌ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. భాజపా కూటమి 31 స్థానాలను గెలుచుకొని విజయఢంకా మోగించింది. దీంతో నితీశ్‌కుమార్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ నేపథ్యంలో కులరాజకీయాలకు పెట్టింది పేరైన బిహార్‌లో మహాదళిత్‌ వర్గానికి చెందిన జితన్‌రామ్‌మాంఝీని సీఎంగా నియమించారు. ఈ ఏడాదిలోనే బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ప్రభావాన్ని నిలువరించడంతో పాటు రాష్ట్రంలో గణనీయంగా వున్న దళిత ఓట్ల కోసం నితీశ్‌ ఈ వ్యూహం పన్నారు. అయితే జితన్‌రాం పాలనపై, పార్టీపై తనదైన ముద్రకు యత్నించాడు. ఎన్నికల వరకు తానే కొనసాగుతానని స్పష్టంచేశారు. ప్రస్తుత బిహార్‌ సమకాలీన రాజకీయాలను పరిశీలిస్తే బిహార్‌లో భాజపా కూటమి ఒక వైపు, మరోవైపు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మోహరించాయి. రాష్ట్ర రాజకీయాల్లో బద్దశత్రువులుగా వున్న నితీశ్‌, లాలు ప్రసాద్‌లు భాజపా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు కూటమిగా ఏర్పడటం గమనార్హం.

జనతాదళ్‌ యునైటెడ్‌ బిహార్‌ శాసనసభా పక్షనేతగా నితీష్‌ను మెజార్టీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు. అయితే మాంఝీ సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించడం లేదు. తనను వ్యతిరేకించిన 19 మంది మంత్రుల్ని తొలగించాలని ఆయన గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠికి లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకు మాంఝీ దిల్లీ బాట పట్టానురు. బీహార్‌లో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ నివాసంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌.. తదితరులు సమావేశమయ్యారు.