బుకీలను అదుపు చేయలేం

నివేదికొచ్చాకే చర్యలు
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌
చెన్నై, మే19 (జనంసాక్షి) :
బుకీలను అదుపు చేయలేమని, స్పాట్‌ ఫిక్సింగ్‌పై నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ ఆదివారం చెన్నైలో అత్యవసరంగా సమావేశం అయింది. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ విలేకరులతో మాట్లాడారు. బుకీలను కంట్రోల్‌ చేయలేమని ఆయన చెప్పారు. బుకీలను అదుపు చేయడంలో తాము నిస్సహాయులమన్నారు. క్రికెటర్లకు, ఏజెంట్లకు తమ గుర్తింపు తప్పని సరి అంటూనే, బుకీలపై తమకు ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. అరెస్టైన ముగ్గురు ఆటగాళ్లపై కేసు పెట్టాలని రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆదేశించినట్లు చెప్పారు.ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. స్పాట్‌ ఫిక్సర్ల పైన చర్యలు తీసుకోవాలని తాము సంబంధింత ఫ్రాంచైజీని ఆదేశించినట్లు చెప్పారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ విషయమై ఐసిసి అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతోందన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆధారాలు తమకివ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు చెప్పారు. దీనిపై అంతర్గతంగా విచారిస్తామని, విచారణాధికారిగా సవాని నియమించినట్లు చెప్పారు. కాగా, ముగ్గురు క్రికెటర్ల పైన జీవిత కాలం నిషేధంపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిక్సింగ్‌ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా బుకీల పైన దాడులు చేస్తున్నారు. క్రికెటర్లు బస చేసిన ¬టళ్లకు సిసి టివి ఫుటేజ్‌లను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన ముగ్గురు క్రికెటర్లపై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యాజమాన్యం క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.