బుడతడి టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావల్సిందే..!

12 నిమిషాల్లో 60 పద్యాలు చదివి రికార్డ్ సృష్టించిన బుడతడు
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సిద్దిపేట జిల్లా వాసి
చేర్యాల (జనంసాక్షి) జూన్ 02 : ఐదేళ్ల వయసులోనే మనం చేసే పనుల పట్ల ఆసక్తి, తపన, పట్టుదల ఉంటే ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా సాధించుకోవచ్చని ఒకటవ తరగతి చదువుతున్న అయిదేళ్ల విశ్రుత్ రుజువు చేస్తున్నాడు. పట్టుదలతో నేర్చుకుంటే ఎలాంటి అసాధ్యమైన పని సుసాధ్యం అవుతుందని నిరూపిస్తున్నాడు. తన మేధస్సుకు పదునుపెట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ను అయిదేళ్ళ వయస్సులోనే సాధించాడు. మాటలు స్పష్టంగా రాని వయస్సులో కేవలం 12 నిమిషాల్లో 60 పద్యాలు (రైమ్స్) హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో అవలీలగా చదివి ఐబీఆర్ లో స్థానం సంపాదించారు. 5 ఏళ్ల ప్రాయంలో మూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన విశ్రుత్ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లి గ్రామానికి చెందిన బండారి ప్రసాద్-స్వాతిల కుమారుడు విశ్రుత్ కాగా ప్రస్తుతం ఉద్యోగ రీత్యా కుటుంబం హైదరాబాద్ లోని జవహర్
నగర్ బీరప్పగడ్డలో నివాసముంటున్నారు. మూడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన విశ్రుత్ ని గురువారం జవహర్ నగర్ మేయర్ కావ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షిస్తూ శాలువతో ఘనంగా సత్కరించారు.