బుణాలు చెల్లింపు గడువు పెంచాలి

గుంటూరు, ఆగస్టు 1 : పసుపు పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వచేసి వాటిపై తీసుకున్న బుణాలను చెల్లింపు గడువును మరోనాలుగు నెలలు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని పసుపు రైతులు కలెక్టరికి విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పసుపు రైతులు బుధవారం ఎమ్మెల్యే ఎన్‌ ఆనందబాబు నేతృత్వంలో కలెక్టరేట్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను కలిసి ఆనందబాబు మాట్లాడుతూ దుగ్గిరాల శీతల గిడ్డంగుల్లో నిల్వ పెట్టుకొన్ని రైతులకు పసుపును ఎసిబిఐ బ్యాంకు అధికారులు నిర్భంధంగా బహిరంగ వేలం వేయడాన్ని అడ్డుకొన్నారని, ఇదే పసుపుపంటను ఎసిబిఐ నుంచి రైతులు బుణాలు తీసుకొన్నారని అన్నారు. బుణం పొందిన తరువాత పంట రేటు దిగజారుతూ వచ్చిందని, రైతులు నష్టపోవడం ఇష్టంలేక, తక్కువధరకు పంటను అమ్ముకోలేక బ్యాంకు బుణాలు చెల్లించడంలో జాప్యం జరిగిందని అన్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని బ్యాంకు అధికారులు, స్టోరేజ్‌ నిర్వాహకులు పసుపు వ్యాపారులతో కుమ్మక్కై పంటను వేలం వేయడానికి సిద్ధపడ్డారన్నారు. రైతులు మార్కెట్లో మంచి ధర వచ్చేవరకు పసుపు విక్రయాలు చేపట్టే స్థితిలో లేరని, కాబట్టి బ్యాంకు అధికారులతో చర్చించి, బుణాలు చెల్లింపుగడువును వాయిదా వేయాల్సిందిగా ఆయన కోరారు. ఇదే విధంగా పసుపు మద్దతు ధరను 6వేల రూపాయలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్‌ ఆనంద్‌బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌కుమార్‌లు, కలెక్టర్‌ను కోరారు.