బెంగాల్‌ హింసపై నోరు మెదపని మమత

పంచాయితీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం
కోల్‌కతా,మే23(జ‌నం సాక్షి): పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో..మమత పాలన ఎలా ఉందో ఇటీవలి పంచాయితీ ఎన్నికల హింసను పరిశీలిస్తే తెలుస్తుంది. గతంలో కమ్యూనిస్టులను ఆడిపోసుకున్న మమత తన హయాంలో కూడా కుహనా రాజకీయాలకు తెలేపారు. కేంద్రం అరచకాలపై పోరాడుతున్న మమత సొఓంత రాష్ట్రంలో ప్రజలకు ఓటు వేసే స్వేఛ్ఛ లేకుండా చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బుదాఖలిలో చోటుచేసుకున్న  ఘటనలు దారుణం కాక మరోటి కావు. ఏకంగా తృణమూల్‌ కార్యకర్తలు లాఠీలు పట్టి దాడులు చేయడం టీవీల్లో నేరుగా ప్రసారం జరిగింది. ఈ ఘటనలపై కేంద్రం నివేదిక కోరింది. అయినా  వీటిని ఖండించని మమత బెనర్జీ కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు.  పోలింగ్‌ రోజున జరిగిన హింసలో16 మంది హత్యకు గురికావడం తృణమూల్‌ రాక్షసత్వానికి పరాకాష్టగా భావించాలి. మూడంచెల పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిహాసం  అయింది. అధికారబలంతో  తృణమూల్‌ కాంగ్రెస్‌ యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతూ రాష్ట్రంలో నెత్తుటేరులు పారించింది. స్థానిక ఎన్నికల్లో ఇంత పెద్దయెత్తున హింస చెలరేగడం బెంగాల్‌ చరిత్రలో అసాధారణం. ప్రజాస్వామ్యంపై తృణమూల్‌ నగ్నంగా దాడి చేయడమే కాదు, సజీవ దహనం చేసిన ఘటనలు అత్యంత కిరాతకానికి అది ఒడిగట్టింది. దాదాపు అన్ని జిల్లాల్లోను తృణమూల్‌ దురాగతాలు యథేచ్ఛగా సాగిపోయాయి. పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, బ్యాలెట్‌ పెట్టెలను ఎత్తుకెళ్లడం, బ్యాలెట్‌ పత్రాలను చించేయడం, పోలింగ్‌ కేంద్రాల్లోని ప్రతిపక్షాల ఏజెంట్లను బలవంతంగా తరిమేయడం, ఓటు వేసేందుకు వచ్చిన వారిపై కాల్పులు జరపడం. బాంబులు విసురుతూ భయోత్పాతం సృష్టించడం తృణమూల్‌ ఆటవిక సంస్కృతికి తిరుగులేని దృష్టాంతాలు. ఇంత ఘోరం జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగినట్లు వ్యవహరించింది. పోలింగ్‌కు రెండు వారాల ముందే మొత్తం 58,692 స్థానాలకు గాను 20,076 స్థానాల్లో పోటీ లేకుండా తృణమూల్‌ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించుకోవడమే ఒక పెద్ద ప్రహసనం. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా తృణమూల్‌ గూండాలు ఎలా అడ్డుకున్నదీ, ప్రతిపక్ష
అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఎలా ఉపసహరింప జేయించినదీ విూడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. పోలింగ్‌కు ముందు ఏకగ్రీవం పేరుతో ప్రకటించిన 20 వేల సీట్లలో గెలుపొందినవారికి తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కొల్‌కతా హైకోర్టు , సుప్రీం కోర్టు ఆదేశించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నూటికి నూరు శాతం సీట్లు దక్కించుకోవడం కోసం ప్రజాస్వామ్యం పీక నులిమేసేందుకు సైతం వెనుకాడని మమత నిరంకుశ పోకడలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. ఎన్నికల పక్రియను ప్రహసనంగా మార్చేసిన తృణమూల్‌ దురాగతాలకు వ్యతిరేకంగా అటు బెంగాల్‌లోను, ఇటు దేశ వ్యాపితంగాను నిరసనలు ¬రెత్తాయి. బెంగాల్‌లో హింసను ప్రజాస్వామ్య ప్రియులందరూ ముక్త కంఠంతో ఖండించాలి.
ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారింది. ఎన్నికల అక్రమాలపె ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా మమత స్పందించలేదు. తృణమూల్‌ గూండాలు ప్రతిపక్షాల అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తుంటే వారు ప్రేక్షక పాత్ర వహించారు. కొన్ని చోట్ల తృణమూల్‌ గూండాలతో కలసి ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు దిగిన ఉదంతాలూ ఉన్నాయి.  ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని ఇంత బాహాటంగా ఖూనీ చేస్తూ, ఇంకొక వైపు బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస మామూలేనని, వామపక్షాల పాలనలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడడం వారి తెంపరితనానికి నిదర్శనం. అసత్యాలు, అవాస్తవాలతో వామపక్షాలపై బురద చల్లడం ద్వారా తృణమూల్‌ తన పాపాలను కప్పిపుచ్చుకోవాలని చూడడం హేయమైన చర్య.