బోటు బయటకొచ్చింది!

– గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీత
– రోప్‌లు, లంగర్‌లతో వెలికితీసిన సత్యంబృందం
– పూర్తిగా ధ్వసమైన బోటు, ఐదు మృతదేహాలను గుర్తింపు
కాకినాడ,అక్టోబర్‌ 22(జనంసాక్షి):తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ఎట్టకేలకు బయటకొచ్చింది. ధర్మాడి సత్యం టీమ్‌ బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. మంగళవారం డైవర్ల సాయంతో మరోసారి నీటి అడుగుభాగం నుంచి రోప్‌లు కట్టి వెలికితీసే ప్రయత్నం చేశారు. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించినా ఆపకుండా ప్రయత్నాలు కొనసాగించారు. జేసీబీ సాయంతో ఆ రోప్‌లను బయటకు లాగారు.. దీంతో నీళ్లపైకి బోటు వచ్చింది. బోటులో ఐదు మృతదేహాలను గుర్తించారు. సెప్టెంబర్‌ 15న కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 44 మృతదేహాలు వెలికితీశారు. మరో 7 మృతదేహాల కోసం గాలిస్తూనే ఉన్నారు. కాగా బోటు మునిగిన కొద్ది రోజులకు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులు నిలిపివేశారు. గత వారంలో రెండసోరి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ రెండు, మూడు రోజుల పాటూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కాకినాడా పోర్ట్‌ నుంచి కెప్టెన్‌ ఆదినారాయణను పిలిపించారు. అలాగే స్కూబా టీమ్‌ కూడా రంగంలోకి దిగింది. బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం విశాఖ నుంచి డైవర్స్‌ను పిలిపించారు. వారి సాయంతో గోదావరిలోకి దిగి బోటుకు రోప్‌లు కట్టి బయటకు లాగే ప్రయత్నాలు చేశారు.. కానీ అది కూడా బెడిసికొట్టింది. ధర్మాడి సత్యం టీమ్‌ ప్రయత్నాలు ఫలించకపోయినా.. మంగళవారం మళ్లీ రోప్‌లు కట్టి బోటును బయటకు లాగింది. ఈసారి మాత్రం బోటు నీళ్లపైకి తేలింది. దాన్ని ఒడ్డుకు చేర్చడంలో సత్యం టీం సఫలీకృతమైంది. కాగా ఆ బోటులో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో రెండు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది.