ప్రతీ క్రికెటర్‌కూ అవకాశం రావాలనే రొటేషన్‌ పాలసీ : ఎంఎస్ ధోనీ

భారత క్రికెట్‌లో రొటేషన్‌ పద్ధతి గత రెండు దశాబ్దాలుగా ఎక్కువగా కొనసాగుతోంది. అంతకుముందు ఏ సిరీస్‌కు వెళ్లినా తుది జట్టులో మాత్రం అదే 11 మంది ఉండేవారు.

ఆ తర్వాత భారీ మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ప్రతీ క్రికెటర్‌కూ అవకాశం రావాలనే ఉద్దేశంతో.. రొటేట్ చేస్తూ మ్యాచ్‌లు ఆడించేది. ఇక ఐపీఎల్‌ వచ్చాక ప్రతి ఆటగాడు తన సత్తా నిరూపించుకొనేందుకు ఓ వేదికగా చేసుకుంటున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. అందువల్లే ఇప్పుడున్న టీమ్‌ఇండియాలో మంచి పోటీ వాతావరణం నెలకొంది. మూడు ఫార్మాట్లు కావడంతో యువ క్రికెటర్లకూ అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పుడు భారత్‌ వరుసగా సిరీస్‌లు ఆడుతోంది. దీంతో మరోసారి ఈ రొటేషన్‌ పాలసీ చర్చకొచ్చింది. అయితే, ఇలాంటి విధానం భారత క్రికెట్‌కు అవసరమని 2006లోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) వెల్లడించినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తెలిపింది. అప్పుడు పీటీఐతో ధోనీ సంభాషణను మరోసారి గుర్తుచేసింది.

”క్రికెట్‌లో రొటేషన్ విధానం అత్యంత కీలకం. అప్పుడు ఆటగాళ్లు తమకు అవకాశం రాలేదనే బాధ ఉండదు. అదే సమయంలో వరుసగా మ్యాచ్‌లు ఆడేవారికి విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. మళ్లీ ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ఛాన్స్‌ ఉంటుంది. రొటేషన్‌ పద్ధతి ప్రతి క్రికెటర్‌కూ తుది జట్టులో ఆడి తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి మార్గం. ఒకవేళ ఎప్పుడూ అదే 11 మందితో మ్యాచ్‌లు ఆడుతూ ఉంటే కొత్తవారికి ఛాన్స్‌ రావడం చాలా కష్టమవుతుంది. 15 మందితో కూడిన స్క్వాడ్‌లో అందరినీ ఆడించడం వల్ల అనుభవం పెరుగుతుంది. వారిలో అభద్రతాభావం తలెత్తకుండా ఉంటుంది. సుదీర్ఘకాలంపాటు కెరీర్‌లు కొనసాగాలంటే రొటేషన్‌ విధానానికి మించింది మరొకటి లేదు” అని ధోనీ వ్యాఖ్యానించాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి (2005) అడుగుపెట్టి అప్పటికి కేవలం ఒక్క ఏడాది మాత్రమే కావడం గమనార్హం.

ఐపీఎల్ 2025.. ఇంకా ఖరారుచేయని ధోనీ

ఐపీఎల్‌ 2025 (IPL 2025) సీజన్‌లో ఆడటంపై ధోనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే రిటెన్షన్, రైట్‌ టు మ్యాచ్ విధానాలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపు ఫ్రాంచైజీలు తమ జాబితాలను సమర్పించాల్సి ఉంది. దీంతో ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మాజీ కెప్టెన్‌ను రూ.4 కోట్లకు రిటైన్ (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా) చేసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ”సీఎస్కే తరఫున ధోనీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ, అతడు మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. తప్పకుండా ఈ వారం రోజుల్లోనే చెబుతాడని అనుకుంటున్నాం. అతడి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు. ఒకవేళ ధోనీ కొత్త సీజన్‌లో ఆడకపోతే మాత్రం మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

తాజావార్తలు