మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) పరీక్ష జరుగనుంది. తొలిరోజు జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రెండోరోజైన మంగళవారం జరిగిన జనరల్‌ ఎస్సే పేపర్‌కు 31,383 మంది అభ్యర్థులకుగాను 21,817 (69.4శాతం) హాజరయ్యారు. 10 వేల మంది డుమ్మాకొట్టడం గమనార్హం.అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్‌లో 5 వేల 613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 87.23 శాతం మందికి గాను 4 వేల 896 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారు. మరో 717 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి పరిధిలో 8 వేల 11 మందికి గాను 5 వేల 854 మంది పరీక్ష రాశారు. మరో 2 వేల 157 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ కొనసాగనున్నాయి. అయితే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు, అచ్చుతప్పులు దొర్లాయి. వ్యాసరూప ప్రశ్నలు కావడంతో సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు కొందరు తెలుపగా, మరికొందరు మాత్రం సులభంగా ఉన్నట్టు తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పేపర్‌ తరహాలోనే ప్రశ్నలు ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు.

జనరల్‌ ఎస్సే పేపర్‌లో తప్పులివే..

మొదటి ప్రశ్నలో సామాజిక అసమానతా(త)లను అభి(ధి) గమించడానికి అనే దోషాలు.
వాతావరణ మార్పులు తగ్గించడంలో పునరుత్పాదక ఇంధన (వనరుల) పాత్రను వివరించండి అన్న ప్రశ్నలో వనరుల అన్న పదం లేదు.
మరో ప్రశ్న చిత్రీకరణకు చిత్రికరణ వచ్చింది.

మిగిలిన పరీక్షలు ఇవే..

అక్టోబర్‌ 24న పేపర్‌ 3- ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్
అక్టోబర్‌ 25న పేపర్ 4- ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
అక్టోబర్‌ 26న పేపర్ 5- సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్
అక్టోబర్‌ 27వ తేదీనన పేపర్ 6- తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ