కాలుష్య భూతంపై కదిలిన పల్లెలు

రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేసేందుకు పూనుకున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఊరూవాడా కదిలింది. కాలుష్య భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తరిమికొడతామని రైతులు, స్థానికులు భీష్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జనంసాక్షి దినపత్రికలో ‘పచ్చని పల్లెలపై ఇథనాల్‌ విషం’ శీర్షికన ప్రచురించిన ప్రధాన కథనం సంచలనం రేపింది. ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో ఈ కథనం విస్తృత ప్రచారం కావడంతో స్థానిక రైతులు, యువకులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ అంశంపై గద్వాల జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, రాజోలి మండల పోలీసులు కూడా ఆరా తీశారు. ఆందోళనలు జరగనున్నాయనే సమాచారంతో అక్కడికి ఉదయాన్నే చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల పల్లెల నుంచి ఒక్కొక్కరుగా ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే భైటాయించి ఫ్యాక్టరీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక్కడి నుంచి వెంటనే తరిమివేయాలని, తమ ప్రాణాలను రక్షించాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు, గాలి కలుషితమైతే తమ మనుగడకే ప్రమాదమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని సద్దుమణిగించేందుకు యత్నించినా రైతులు ససేమీరా అన్నారు. చివరకు మూకుమ్మడిగా ఫ్యాక్టరీని తరలించాలని పత్రాలపై సంతకాలు చేసి తహసీల్దార్‌, పోలీసు అధికారులకు అందజేశారు.

తాజావార్తలు