బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న సంస్కరణలు

నగదు,ఎటిఎంల సమస్యలు మరింత తీవ్రం

దివాళా దిశగా అనేక బ్యాంకులు

ఆర్థిక దొంగలకు ఉచ్చు పడితేనే భయం

న్యూఢిల్లీ,మే25(జ‌నంసాక్షి): విజయ్‌ మాల్యా..నీరవ్‌ మోడీ ఇలా ఎందరో బ్యాంకులకు భారీగా ఎగవేసి ఇప్పుడు విదేశాల్లో జల్సా చేస్తున్నారు. ఇలాంటి వారు బ్యాంకులకు ఎగవేయడం వల్ల భారీతీయ బ్యంకింగ్‌ రంగం దివాళా దిశగా నడుస్తోంది. దీనికితోడు బ్యాంక్‌ అధికారులు మోసగాళ్లతో కుమ్మక్కుకావడం వల్ల ప్రజలకు బ్యాంకులపై నమ్మకం లేకుండా పోయింది. ఈ నాలుగేళ్ల మోడీ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా బ్యాంకింగ్‌ రంగం ఆర్థికసంక్షోభంలో కూరుకుని పోయింది. దీనికి ‘పెద్దనోట్ల’ రద్దుతోపాటు బ్యాంకుల్లో గడచిన నాలుగేళ్ల కాలంలో అమాంతం పెరిగిన నిరర్థక ఆస్తులు, బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, బ్యాంకుల్లో అక్రమాలు, ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై నెలకొన్న అనుమానాలే కారణం. మధ్యతరగతి ప్రజల్లో బ్యాంకుల పట్ల విశ్వాసం క్రమంగా తగ్గుతోంది. కాబట్టి వారు డబ్బును తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకు డిపాజిట్లు తగ్గుతున్నాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక శక్తులు వంటివి రూపాయి మారకపు విలువను, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయి. మోదీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల కారణంగా ఓ రకంగా బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఈ నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా దాని ఫలితం ప్రజలకు కానరావడం లేదు. 2014 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2018 ఆర్థిక సంవత్సరానికి 3.6 శాతానికి కోసుకుపోయింది. దీనివల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను రెండు శాతం మేర తగ్గించగలిగింది. తగ్గిన వడ్డీరేట్లు సొంత ఇల్లు కొనుక్కోవాలనే సగటు మధ్యతరగతి జీవుల కలలు నెరవేరడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీగా పెరిగింది. ముద్రా

బ్యాంకు ఏర్పాటు ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నిధులు అందించడం వంటి పనులు జరిగాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు సగటున 7.3 శాతంగా నమోదైంది. ఫలితంగా దేశంలో ఉద్యోగ కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహమూ ఈ నాలుగేళ్లలో పెరిగింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 420 బిలియన్‌ డాలర్లకు పెరగడంతోపాటు రూపాయి మారకం రేటు స్థిరీకరణకు దోహదపడింది. బ్యాంకింగ్‌ సేవలకు దూరంగా ఉన్న ఎంతోమంది ప్రజానీకానికి బ్యాంకు సేవలు పొందడానికి ఇదొక అవకాశం కల్పించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికి 31.6 కోట్ల కొత్త ‘జీరో బ్యాలెన్స్‌’ ఖాతాలు తెరిచారు. వీటి ద్వారా దాదాపు రూ.81,203 కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో జమ అయ్యాయి. అయితే 1963 తరవాత, 2017-18 సంవత్సరంలోనే డిపాజిట్ల వృద్ధి రేటు అత్యంత కనిష్టంగా 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో లక్ష జనాభాకు సగటున 18.7 బ్యాంకు బ్రాంచీలు ఉంటే, గ్రామాల్లో అవి కేవలం 7.8 మాత్రమే ఉన్నాయి. మరోవంక దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని 55శాతం సంస్థలు తమ కూలీలకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో పడిపోయాయి. దాంతో పరిశ్రమల కార్యకలాపాలపై భారీ దెబ్బ పడింది. బ్యాంకుల్లోనూ, ఏటీఎంలలోనూ సరిపడా డబ్బు ఉంచకపోవడం ద్వారా సామాన్యుడిని ముప్పుతిప్పలు పెట్టింది. దేశంలోని ఏటీయంలలో అత్యధిక శాతం పనిచేయడంలేదు. బ్యాంకుల నష్టాలను ప్రజలనుంచి డిపాజిట్లను సేకరించడం ద్వారా భర్తీ చేసేందుకే ప్రవేశపెడుతున్నారన్న వార్తలూ ప్రజలను ఆందోళనలో పడవేశాయి. భారతీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు గడచిన నాలుగేళ్లలో అమాంతం పెరిగి రూ.11.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో నిరర్థక ఆస్తుల వాటా 80 శాతానికి పైమాటే అనుకోవాలి. మొత్తంగా బ్యాంకింగ్‌ రంగం కుదేలయ్యిందనే చెప్పుకోవాలి. బ్యాంకుల పనితీరు దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం మోపకుండా చూడాల్సింది. ఆధార్‌ అనుసంధానాన్ని సబ్సిడీలలో లీకేజీలు, ప్రభుత్వ నిధుల విడుదల, సేవల్లో దుర్వినియోగాన్ని అరికట్టడం వరకే ఉపయోగిస్తే శ్రేయస్కరం. బ్యాంకుల్లో నగదు లేమి సమస్యను తక్షణం పరిష్కరించాలి. అనవసర భయాలనుంచి ప్రజలను బయట పడేయకపోతే బ్యాంకులపై పూర్తిగా నమ్మకం సన్నగిల్లగలదు.