బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె షురూ

– తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ బ్యాంకులు
– వేతనాలు పెంచేంత వరకు దశలవారిగా పోరాటం
– స్పష్టం చేసిన యూఎఫ్‌బీఏ
– నగదు లేక వెలవెల బోతున్న ఏటీఎంలు
– హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సేవలు యథాతథం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే30(జ‌నం సాక్షి) : వేతన సవరణను డిమాండ్‌ చేస్తూ అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు బుధవారం సమ్మెకు దిగారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 48 గంటల పాటు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం యూఎఫ్‌ బీఏ స్పష్టం చేసింది. బ్యాంకులు ఆపరేషనల్‌ లాభాల్లో ఉన్నప్పటికీ రుణ ఎగవేతదారులతో ముడిపెడుతూ జీతాలను పెంచకపోవడంపై ఆందోళన చేస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 80వేల మంది ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సహా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నారు. తమ వేతనాలు పెంపులో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రుణ ఎగవేతదారుల సాకు చూపుతూ వేతనాలు పెంచకపోవటం దారుణమన్నారు. 14 నుంచి 15శాతం వరకు వేతనాలు పెంచాలని లేకుంటే వరకూ దశలవారీగా పోరాటం కొనసాగుతుందని యూఎఫ్‌ బీఏ స్పష్టం చేసింది. మరోవైపు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకపోవటంతో వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. అటు ఏటీఎంలలోనూ నగదు నిండుకోవటంతో రోజువారీ ఆర్ధిక కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సేవలు యథాతథం..
వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం, గురువారాల్లో సమ్మె చేపట్టనున్నారు. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకుల సేవలు బుధవారం ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయాయి. అయితే ఈ సమ్మెకు కొన్ని ప్రయివేటు బ్యాంకులు దూరంగా ఉన్నాయి. యూనియన్‌లో ఈ బ్యాంకులు లేకపోవడంతో అవి సమ్మెలో పాల్గొనలేదు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాంటి కొత్తతరం ప్రయివేటు బ్యాంకులు ఈరెండు రోజుల సమ్మెలో పాల్గొనలేదు. దీంతో ఆ బ్యాంకుల కార్యకలాపాలు బుధవారం యథాతథంగా కొనసాగాయి. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గురువారం కూడా తమ సేవలు అందుబాటులోనే ఉంటాయని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి.