బ్యాట్స్‌మెన్‌ బాధ్యత తీసుకోలేదు: ధోని ఇంగ్లండ్‌ స్పిన్నర్‌లను అభినందించిన భారత సారథి

నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: సొంతగడ్డపై ఎనిమిదేళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఓటమికి కారణాలు చెప్పాడు. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడలేదని వ్యాఖ్యానించాడు. బౌలర్లు పర్వాలేదనిపించినా బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నాడు. సిరీస్‌లో పుజారా ఒక్కడే నిలకడగా ఆడాడని ప్రశసించాడు. ముంబై, కోల్‌కత్తా టెస్టులలో బ్యాటింగ్‌ వైఫల్యమే కొంపముంచిందని అంగీకరించాడు. స్పిన్నింగ్‌ ట్రాక్స్‌పై ఇబ్బంది పడడం సహజమే అయినప్పటకీ తమ బ్యాట్స్‌మెన్‌ త్వరగా లొంగిపోయారని మ్యాచ్‌ అనంతరం ధోనీ చెప్పాడు. భారత స్పిన్నర్లతో పోలిస్తే ఇంగ్లాండ్‌ స్పిన్నర్లు తేడా చూపించారని కితాబిచ్చాడు.  అయితే సిరీస్‌లో కొన్ని పాజిటివ్స్‌ కూడా వచ్చాయని భారత సారధి తెలిపాడు.పుజారా బ్యాటింగ్‌, కోహ్లీ ఆటతీరు, గంభీర్‌ మళ్ళీ ఫామ్‌లోకి రావడం సానుకూలంశాలుగా అభినర్ణించాడు. రెండు పెద్ద జట్లు ఆడుతున్నప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయన్న ధోనీ మిగిలిన సీజన్‌లో పుంజుకుంటామని చెప్పాడు. కాగా స్వదేశంలో ధోనికి ఇదే తొలి సిరీస్‌ ఓటమి. మరోవైపు తమకు ఈ విజయం చాలా ప్రత్యేకమైనదిగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ అభివర్ణించాడు. తమ శ్రమకు తగిన ఫలితం వచ్చిందని, భారత్‌ టూర్‌కు పూర్తి స్థాయిలో ప్రిపేరవడం బాగా ఉపయోగపడిందని ఆనందం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టిగా రాణించిందని, స్పిన్నర్లు పనేసర్‌, స్వాన్‌లు కూడా అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. అలాగే అభిమానుల నుండి మంచి మధ్ధతు లభించిందని చెప్పాడు.