బ్రహ్మగుడి పూజారిపై వ్యక్తి దాడి 

– రాష్ట్రపతిని గుడిలోకి వెళ్లనివ్వలేదంటూ ఆరోపణ
జైపూర్‌, మే29(జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లోని పుష్కర్‌ వద్ద ఉన్న బ్రహ్మగుడి ప్రధాన పూజారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల రాజస్థాన్‌ పర్యటన సందర్భంగా ఈ గుడికి వెళ్ళారని, ఆయన దళితుడు కావడంతో ఆయనను గుడిలోకి వెళ్ళనివ్వలేదని బూటకపు వార్తలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వచ్చాయి. దీంతో ఈ వ్యక్తి ప్రధాన పూజారిపై దాడి చేసి, గాయపరిచాడని తెలుస్తోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ దళితుడైనందున ఆయనను గుడిలోకి ఈ పూజారి రానివ్వలేదని నిందితుడు ఆరోపించాడు. సంఘటనపై పోలీసులు స్పందించారు. నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. బాధితుడైన పూజారి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ రామ్‌నాథ్‌ కోవింద్‌ తమ గుడికి వచ్చినపుడు తాను అక్కడ లేనని చెప్పారు. తాను అక్కడే ఉండి ఉంటే ఆయనను గుడిలోకి తీసుకెళ్ళి, పూజలు చేయించి ఉండేవాడినన్నారు. రాజస్థాన్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల వెళ్ళారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె, సతీమణి కూడా వెళ్ళారు. వీరిని గుడిలోపలికి వెళ్ళనివ్వలేదని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమవడంతో ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ ఈ సమాచారాన్ని ఖండించింది. ఇవన్నీ పుకార్లేనని తెలిపింది. అంతేకాకుండా రామ్‌నాథ్‌ కోవింద్‌ పత్రికా కార్యదర్శి కూడా ఓ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి పుష్కర్‌ సందర్శన సమయం చాలా తక్కువ అని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నమే ముంబై వెళ్ళవలసి ఉండటంతో, సమయం సరిపోలేదని తెలిపారు. ప్రభుత్వం, దేవాలయ అధికారులు, పూజారులు చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, బ్రహ్మ గుడిలో సంపూర్ణ దర్శనం చేసుకోవడానికి రాష్ట్రపతికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. గుడి ముందునే ప్రార్థన చేయాలని రాష్ట్రపతి నిర్ణయించుకున్నారని తెలిపారు. దీనికి ఇతర కారణాలేవీ లేవన్నారు. ఆయన చేత పూజారి లక్ష్మీనారాయణ వశిష్ఠ్‌ పూజలు చేయించారని తెలిపారు. అయితే రామ్‌నాథ్‌ కోవింద్‌ కుమార్తె బ్రహ్మ గుడిలోకి వెళ్ళి పూజలు చేశారని వివరించారు.