బ్లాక్‌మనీపై సహకరించండి

4

– స్విస్‌ అధ్యక్షునితో ప్రధాని మోదీ

బెర్న్‌,జూన్‌ 6(జనంసాక్షి):బ్లాక్‌ మనీ వ్యవహారంలో సహకరించాలని ప్రధాని మోడీ స్విస్‌ అధ్యక్షుడిని కోరారు.స్విట్జర్లాండ్‌ తో భారత్‌ మెరుగైన సంబంధాలు కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. స్విస్‌ అధ్యక్షుడితో సమావేశం అనంతరం జెనీవాలో ఇరుదేశాల అధినేతలు జాయింట్‌ స్టేట్‌ మెంట్‌ విడుదల చేశారు. భారత్‌ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు స్విస్‌ అధ్యక్షుడు తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్‌ నుంచి మౌలిక సదుపాయాల విషయంలో సహకారం కోరుతున్నామన్నారు. ఎన్‌.ఎస్‌.జి లో సభ్యత్వం కోసం భారత్‌ చేసిన విజ్ఞప్తికి స్విట్జర్లాండ్‌ సానుకూలంగా స్పందించింది. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్‌ల్యాండ్‌కు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జోహన్‌ షియయిడర్‌ అమ్మన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌, ఖతర్‌, స్విట్జర్‌ల్యాండ్‌, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించేందుకు మోదీ బయలుదేరిన విషయం తెలిసిందే. ఇకపోతే  అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మోదీ.. ఏడోసారి ఒబామాతో సమావేశం కానున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆఫ్ఘన్‌, ఖతార్‌, స్విట్జర్లాండ్‌ పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ.. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి వాషింగ్టన్‌ చేరుకోనున్నారు. అమెరికాను తమ సహజ భాగస్వామిగా పేర్కొన్న మోదీ.. రెండు దేశాల బంధం బలపడటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ పర్యటనలో భాగంగా ఓవల్‌ కార్యాలయంలో ఒబామాతో ద్వైపాక్షిక చర్చలతోపాటు వైట్‌హౌజ్‌లో విందు ఆరగించనున్నారు ప్రధాని మోదీ. 2014 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు మోదీ, ఒబామా ఆరుసార్లు కలుసుకోగా, ఇద్దరి మధ్యా లెక్కలేనన్ని ఫోన్‌కాల్స్‌ నడిచాయని ఆ ప్రకటన పేర్కొంది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వాతావరణ మార్పులు, క్లీన్‌ ఎనర్జీతోపాటు ఇండోపసిఫిక్‌ రీజియన్‌లో భద్రత, దౌత్యపరమైన సహకారం, స్థిరమైన ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. పర్యటనలో భాగంగా మోదీ కాంగ్రెస్‌ రెండు సభల్లోనూ ప్రసంగించే అరుదైన గౌరవాన్ని మోదీ పొందనున్నారు. వచ్చే జనవరితో ఒబామా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మోదీతో ఆయనకు ఇదే చివరి భేటీ కానుంది. భేటీలో భాగంగా న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో భాగస్వామి కావడానికి భారత్‌ చేసుకున్న దరఖాస్తుపై కూడా చర్చించనున్నారు. ఎన్‌ఎస్‌జీతోపాటు ఆస్టేల్రియా గ్రూప్‌, వాసెనార్‌ అరేంజ్‌మెంట్‌, మిస్సైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రిజిమ్‌ (ఎంటీసీఆర్‌) గ్రూపులలో భారత్‌ భాగస్వామ్యాన్ని ఒబామా ప్రభుత్వం బలంగా కోరుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ ఎంటీసీఆర్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల హైటెక్‌ మిస్సైల్స్‌ను భారత్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం దక్కుతుంది. పర్యటనలో భాగంగా అమెరికా చట్టప్రతినిధులతోనూ మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది.