భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర
హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత మూడురోజులుగా భక్తులతాకిడి పెరగడంతో దేవాలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది మేడారం జాతర ఉండడంతో ప్రతియేటా జరిగే ఐనవోలు మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు.
గజ్జెలలాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నకోల…..
గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నకోల పట్టుకుని చేసిన శివతాండవంతో ఐనవోలు మల్లన్న జాతర అదిరిపోయింది. ఒగ్గుపూజారుల పాటలు , ఢమరుకం, డోలు వాయిద్యాలకు అనుగుణంగా తన్మయత్వంతో శివసత్తులు తాండవం చేశారు. పురుషులు సైతం మహిళా వేషధారణ వేసుకుని స్వామివారికి బోనం వండి.. దాన్ని అందంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేలఏళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల నృత్య మండపంలో.. శివసత్తులు బిందెళ్లలో పెరుగును పెట్టి కొరడాలతో నిర్వహించే సల్లమండపం భక్తి భావాన్ని తెలిపింది.
ప్రాదేశకాల పూజలతో ద్వారబంధనం………..
ఈ మల్లన్న జాతరకు తెలంగాణ పది జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రకు చెందిన భక్తులుస్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ప్రాదేశకాల పూజలు చేసి ద్వార బంధనం చేశారు. స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణబంధనం, విఘ్నేశ్వర పూజలు, పుణ్యాహవచనము ధ్వజారోహణ, ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించారు. దీంతోపాటు గరుడసేవారథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
శివమెత్తిన శివసత్తుల పూనకాలు…..
శివమెత్తిన శివసత్తుల పూనకాలు, ఢమరుకనాదాలతో ఐనవోలులోని మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తి పారవశ్యంతో స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. పట్నాలు వేసి, దండదీపాలు పెట్టి ,కోడెమొక్కులను చెల్లించుకున్నారు. పిల్లా జెల్లా సల్లంగా ఉండాలంటూ షావాలు తీస్తామంటూ ఐనవోలు మల్లన్నను మొక్కుకున్నారు. మొత్తంగా ఐనవోలు మల్లన్న జాతర జానపదుల ప్రాముఖ్యాన్ని చాటింది. స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఐనవోలు మల్లన్న తిర్నాల జనసంద్రమైంది.