భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం
భద్రాచలం: ముత్యాల ముగ్గుతో.. రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపం సిద్ధమైంది. నుదిటిన సిరికల్యాణపు బొట్టు, మణిబాసికం, బుగ్గనచుక్కా, పాదాలకు పారాణితో పెళ్లి కుమారుడిగా రామయ్య తండ్రి.. సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక వాకీ చుక్కతో పెళ్లి కుమార్తెగా సీతమ్మ తల్లి కల్యాణమహోత్సవానికి ముస్తాబయ్యారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
మరి కాసేపల్లో భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో ప్రభుత్వం 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.