భద్రాచలం దగ్గర గోదావరి జలకళ
భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరిలో జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్నటివరకు ఇసుక మేటలతో ఎడారిని తలపించిన గోదావరి నీటిమట్టం ఐదడుగులకు చేరింది. భద్రచలం పట్టణ వాసులకు తాగునీరు సయితం అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
గోదావరిలో ప్రస్తుత నీటి మట్టం 19.5 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ వర్గాలు తెలిపాయి. వరద నీటి కారణంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండవ గోదావరి బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం గోదావరి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నది వరద క్రమంగా స్నానఘట్టాల వరకు చేరుకోవడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.