భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం
భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పెరగుఉదలను గమనిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 18.9 అడుగులకు చేరింది. ప్రతీ గంటకు కొన్ని పాయింట్ల చొప్పున పెరుగుతోంది. ఎగువన ఉన్న పేరూరులో పెరుగుదల ఉన్నందున మంగళవారం కూడా ఇక్కడ వరద  కొనసాగింది నాలుగు రోజులుగా కొత్త నీళ్లొచ్చి చేరడంతో ప్రవాహ స్థాయి పెరిగింది.  ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.  ఎగువన ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి వస్తున్న వరదతో పాటు ఆగని వానల కారణంగా భద్రాద్రిలో మళ్లీ క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది.  వరద సరళిని తెలుసుకునేందుకు రైతులు ఆసక్తి కనబర్చారు. మొదటి ప్రమాద స్థాయి 43 అడుగులు. దీనికి ముందే కొన్నిచోట్ల లంకల్లోకి వరద చేరే ప్రమాదం ఉండడంతో కొంత ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలను పాటించేందుకు సిబ్బంది సంసిద్ధం కావాల్సి ఉంది. ఇప్పటికే భద్రాచలంలో లాంచీలను అందుబాటులో ఉంచారు. వరదల సమయంలో రాకపోకలకు ఆటంకం కలిగినా ఆహార పదార్థాల పంపిణీలో చిక్కులు తలెత్తకుండా పూర్తిస్థాయి నిల్వలను గోదాములకు తరలించాల్సి ఉంది. తాలిపేరు మధ తరహా ప్రాజెక్టుకు ఎట్టకేలకు వరద నీరు చేరుకోవడం ప్రారంభమైంది.  తాలిపేరుకు చింతవాగు, రోటెంతవాగుల నుంచి వచ్చే వరద నీరు ఇప్పటికీ చేరుకోలేదు. ఆ వాగుల నుంచి వరద నీరు వస్తే ప్రాజెక్టుకు మరింత భారీగా నీటి ప్రవాహం ఉంటుంది.  ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమేపి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే గోదావరి వరదలు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది వరికే ఇందుకు సంబంధించి వరద సవిూక్ష జరిపి అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌ వరదలపై అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి వరదలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.భద్రాచలం జీసీసీ గోదాములో ముందస్తుగా ఆహార వస్తువులను సైతం నిల్వ ఉంచారు. బియ్యం, కిరోసిన్‌ తదితర వాటిని అందుబాటులో ఉంచారు.