భద్రాద్రిలో శరన్నవరాత్రి వేడుకలకు రంగం సిద్దం

10 నుంచి 19 వరకు ఉత్సవాలు

భద్రాచలం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రధాన వేడుకల్లో భాగంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించ నున్నారు. ఏటా ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అక్టోబర్‌ 19న దసరా పండుగను పురస్కరించుకొని పారువేట, జమ్మిపూజ, శ్రీరామలీల ఉత్సవం, రావణాసురుని వద తదితర కార్యక్రమాలు జరపనున్నారు. అక్టోబర్‌ 10నుంచి దేవీ శరన్నవరాత్రి మ¬త్సవాలను సైతం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సమాయత్తమవుతోంది. ఈ మేరకు వైదిక కమిటీ ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్‌10న అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారం, 11న సంతానలక్ష్మి, 12న గజలక్ష్మి, 13న ధనలక్ష్మి, 14న ధాన్యలక్ష్మి, 15న విద్యాలక్ష్మి, 16న ఐశ్వర్యలక్ష్మి, 17న వీరలక్ష్మి, 18న నిజరూపలక్ష్మి, 19న మహాలక్ష్మి అలంకారం గావించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీరోజు స్వామివారికి అభిషేక తిరుమంజనం, అలంకారం, కుంకుమార్చన పూజలు, మంత్రపుష్ప పఠనం, అంతరాలయంలో స్వామివారికి ఆరాధన, రాజదర్బార్‌, యాగశాలలో ¬మాలు, సంక్షేమ రామాయణ హవనం తదితర వాటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ ప్రభుత్వానికి విన్నవించేందుకు సమాయత్తమవుతోంది. అలాగే డిసెంబర్‌9 నుంచి శ్రీ వైకుంఠ అధ్యయన మ¬త్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వివిధ అవతారోత్సవాలను నిర్వహిస్తారు. డిసెంబర్‌9న స్వామివారికి మత్స్యావతారం, 10న కూర్మావతారం, 11న వరాహావతారం, 12న నృసింహావతారం, 13న వామనవతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామవతారం, 16న బలరామవతారం, 17న శ్రీకృష్ణవతారం గావించనున్నారు. డిసెంబర్‌18న ఉదయం తిరుమంగైళ్వార్‌ పరప పదోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి గోదావరి నదీ తీరంలో తెప్పోత్సవం జరుపుతారు.19వ తేదీన ఉత్తర ద్వారదర్శనం వేడుకను నిర్వహించ నున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి రాపత్తు సేవలు జరపనున్నారు.