భద్రాద్రి జిల్లాలో ఎన్ కౌంటర్
– మావోయిస్టు మృతి
– ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు21(జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా, మిగతావారు ఘటనాస్థం నుంచి తప్పించుకున్నారు. కొత్తగూడెం జిల్లాలోని మణగూరు మండలం బుడుగుల అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లాలోని బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. బడుగుల అటవీప్రాంతానికి రాగానే పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు రవి అనే మావోయిస్టు చనిపోగా.. మిగిలినవారు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పార్టీ విస్తరణ కోసం మావోలు గ్రామాల్లో తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.