భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు
ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
వరంగల్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న నీరజ్‌ భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌కు చేరుకున్న ఆయన ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భరద్వాజ్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనన్నారు. భరద్వాజ్‌ మృతికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే కారణమని ఆరోపిం చారు. భరద్వాజ్‌ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించా లన్నారు. అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడు దామని, పాలకులను ఎండగడదామన్నారు. భరద్వాజ్‌ ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుందామని పిలుపుని చ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రాంత మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కాంగ్రెస్‌ కలిసి రాకపోవడంతోనే ఆత్మబలిదానాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని , పోరాడి తెలంగాణ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఎంజీఎం ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భరద్వాజ్‌ అమర్‌ రహే నినాదాలతో హో రెత్తింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా పోస్టుమార్టం నిర్వహించడంపై స్థానిక నాయకులు నిరసన తెలిపారు. అమరవీరుడు భరద్వాజ్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు పలువురు నాయకులు వచ్చారు. టీడీపీ నేత చల్ల ధర్మారెడ్డి ఆస్పత్రకి చేరుకోవడంతో విద్యార్థులు రెచ్చి పోయారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకు న్నారు. సీమాంధ్రుల వల్లే భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకు న్నారని ఆరోపించారు. భరద్వాజ్‌ అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. హన్మకొండ అమరవీరుల స్తూపం నుంచి భరద్వాజ్‌ నివాసం గోపాలపురానికి తరలించారు. అక్కడ నుంచి శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించారు. అంతకుముందు ములుగురోడ్‌ చౌరస్తాలో వాహనంపై నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కిందపడ్డాడు. స్వల్పంగా గాయపడిన ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అంతిమయాత్రలో ఎంపీ రాజయ్య, టీిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, రాజయ్య, వినయ్‌భాస్కర్‌, మొలుగూరి భిక్షపతి, నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.