భరోసా ఇవ్వని ఉపాధిహావిూ
వలసలను ఆపేలా చూడాలి
అనంతపురం,ఆగస్ట్28(జనం సాక్షి ): ఉపాధిహావిూ పథకాన్ని పక్కాగా అమలు చేయకపోవడం వల్లనే అనేకమంది బతుకు తెరువు కోసం జిల్లాను వీడి వలస బాటపట్టారని సిపిఐ ఆరోపించింది. జిల్లాలో ఉపాధి హావిూ పథకం పక్కాగా అమలయితే వలసలు ఎందుకుంటాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ అన్నారు. కూలీలు ఎందుకు వసలపోతారని ఆయన ప్రశ్నించారు. కావాలనే దానిని నీరుగార్చి కూలీలను వలస పోయేలా చేస్తున్నారని అన్నారు. చేసిన పనికి సకాలంలో డబ్బులు కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వమే వలసలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా ఉపాధి హావిూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఏనాడు కూడా ఉపాధి కూలీల సమస్యలను పట్టించుకున్న దాఖలాలులేవని తెలిపారు. ప్రభుత్వం కరువు నివారణలో భాగంగా ఉపాధి హావిూ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం నేడు నీరుగారుతోందన్నారు. గతంలో వందరోజులు పనిచేసిన వారికి 50రోజులు అదనంగా పెంచారని, ఆ పని పూర్తి చేసిన వారు ఉపాధి, వ్యవసాయ, ఇతర కూలి పనులు లేకపోవడంతో ఇళ్లవద్దనే ఉన్నట్లు పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.మూడు సంవత్సరాలు గడుస్తున్నా కొందరికి ఇతవరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో శుద్ధిజలం లేకపోవడంతో ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోందన్నారు. వాటర్ షెడ్ పనుల్లో కూడా అవతవకలు జరిగాయన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్, రేషన్‌కార్డులున్నా, రేషన్ అందలేదని పలువురు తెలిపారు.