భర్త ఇంటి ముందు భార్య ధర్నా

హైదరాబాద్‌: తనకు న్యాయం కావాలంటూ ఒక ప్రవాస భారతీయ మహిళ రెండేళ్ల కొడుకుతో హైదరాబాద్‌ గాంధీనగర్‌లో భర్త ఇంటి ముందు  ధర్నాకు దిగింది. చెన్నైకి చెందిన యామిని ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తోంది. 2009లో ఆమెకు  హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో వివాహమైంది. ప్రసవానికి చెన్నై వెళ్లిన ఆమె అటునుంచి అటే ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. మధ్య మధ్యలో స్వదేశానికి వచ్చివెళ్తున్న యామినికి ఆస్ట్రేలియాలో గ్రీస్‌కార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్పర్థలు చోటుచేసుకున్నాయి. విడాకుల కోసం భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించగా యామిని విడాకులు వద్దంటూ కోర్టుకెళ్లింది. చెన్నై కోర్టు ఆమె భర్తతో కలిసి వుండవచ్చని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో హైదరాబాద్‌ వచ్చిన యామినిని భర్త ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆమె ధర్నాకు దిగింది. ఆస్ట్రేలియాలో ఆస్తులన్నీ అమ్ముకుని వస్తే తమకు అభ్యంతరం లేదని అత్తింటివారు చెప్తుండగా, భర్తే ఆస్ట్రేలియా రావాలని యామిని డిమాండ్‌ వ్యక్తం చేశారు.