భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గెలిపించండి

కొత్తగూడెం ఏరియా సింగరేణిలో ప్రచారం

అండగా ఉంటామన్న కార్మిక నేతలు

భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, గతంలో కంటే అధిక మెజార్టీతో తనను గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావు కోరారు. కొత్తగూడెం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం ఏరియా, గౌతంఖని ఓపెన్‌ కాస్ట్‌, వీకే వర్క్‌ షాప్‌ల వద్ద జలగం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికులతో కలిసి క్యాంటీన్‌లో టిఫిన్‌ చేశారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ చేసిన అనేక సంక్షేమ పధకాలు, ప్రయోజనాలు, సింగరేణిలో జరిగిన అభివృద్ధిని జలగం వివరించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి..తనకు ఓటు వేయాలని కార్మికులను కోరారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానని జలగం వెంకటరావు అన్నారు. కార్మికులు, కార్మిక సంఘం నాయకులు జలగం వెంకటరావుకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ.. బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి భవిష్యత్తులో మరింత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విూవంతు సహకారం, అండదండలు ఇవ్వాలన్నారు. నాడు 50 ఏళ్ల క్రితం కేటీపీఎస్‌లో అప్పటి దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో నిర్మించిన పాత యూనిట్లను తొలగించి మరో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మించుకున్నామన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతుగా పర్యాటక కేంద్ర అభివృద్ధి, కొత్తగూడెంలో పోలీస్‌ బెటాలియన్‌ తదితర వాటిని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు సాగుదామన్నారు. గతంలో 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులను సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రెగ్యులర్‌ చేశారని, మిగిలిన 286 మంది ఆర్టీషన్లను మూడో లిస్టులో రెగ్యలర్‌ చేయించేందుకు సీఎంతో మాట్లాడి పరిష్కరించుకుందామని అన్నారు. ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ముందుకొచ్చి పరిశ్రమలను స్థాపించే అవకాశం ఉంటుందని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో కేటీపీఎస్‌ ఏడో దశ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హావిూలను పరిష్కరించామని, భూములు కో ల్పోయిన వారికి నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.