భవిష్యత్‌లో మానవ రహిత యుద్ధాలు

రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ఏపీజే అబ్దుల్‌ కలామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
భవిష్యత్తులో మానవరహిత యుద్ధాలే ఉంటాయని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. ఇకముందు జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలేనని అన్నారు. నగరంలోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అణ్వాయుధాలు పెంచుకుంటూ పోతే వాటి రక్షణ పెద్ద సవాలుగా మారుతుందన్నారు. 2017 వరకు ప్రపంచ దేశాలు అణ్వాయుధాలు తగ్గించుకుంటాయన్న నమ్మకం లేదన్నారు. అందుకే అన్ని దేశాలు ఆయుధ సంపత్తిని పోగు చేసుకుంటున్నాయని అన్నారు. అందుకే యుద్ధమంటూ జరిగితే మానవరహిత యుద్ధాలుంటాయన్నారు. ఇందుకు అన్ని దేశాలు కూడా వ్యూహాత్మకంగా పోతున్నాయని అన్నారు. విద్యార్థులు సాంకేతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తూనే నైతిక విలువలూ పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్‌ అందజేశారు. నగరంలోని తాజ్‌కృష్ణలో నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ అబ్దుల్‌ కలామ్‌ పాల్గొన్నారు.