భాజపా అధికారంలోకొచ్చాక పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గాయి

3

ఆప్‌, కాంగ్రెస్‌ మిలాఖత్‌: మోదీ

దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): భారతీయ జనాతా పార్టీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గాయని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్‌, ఆప్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఆమ్‌ఆద్మీపార్టీని వెన్నుపోటుదారుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఓటువేసి మరోసారి పొరపాటు చేయొద్దని దిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోదీ ప్రసంగించారు. ”గత ఎన్నికల్లో మీరు ఓటు వేసిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ కలల్ని చెల్లాచెదరు చేసి దిల్లీని నాశనం చేశారు. దీనికి ప్రతిగా లోక్‌సభ ఎన్నికల్లో వారికి మీరు తగిన శిక్ష విధించారు. ఇప్పుడు కూడా అదే పని చేయండి” అని పేర్కొన్నారు. అరవింద్‌కేజ్రీవాల్‌ పేరు ప్రస్తావించకుండానే ఆయనను.. ప్రయాణికులకు తప్పుడు మాటలు చెప్పి మోసం చేసే ఆటోడ్రైవర్‌తో ప్రధాని పోల్చారు. ప్రజల్ని పదేపదే మోసం చేస్తూ విజయం సాధించలేరని విమర్శించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం భాజపాకున్నా.. ప్రజలు తమకు పాలనాధికారం ఇవ్వలేదని అటువంటి పనులకు పాల్పడలేదని తెలిపారు. నాడు తమకు పూర్తి మెజారిటీ ఇవ్వనందుకు పరిహారంగా లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు ఎంపీస్థానాల్లో భాజపా అభ్యర్థులనే గెలిపించారని మోదీ పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరించి తమకు పూర్తి మెజారిటీ ఇవ్వాలని ఓటర్లను కోరారు. గతంలో ఎన్నడూ చూడనంతటి స్వచ్ఛమైన, స్థిరమైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ కొద్దిపాటి సీట్లకే పరిమితం కావటాన్ని ఎద్దేవా చేస్తూ.. డిపాజిట్ల గల్లంతులో ఆ పార్టీ ప్రపంచరికార్డు సాధించిందని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భారతదేశానికి దిల్లీ ముఖం వంటిదని, ప్రపంచవేదికపై భారత్‌ ఏ విధంగా కనిపించాలనేది ఈ ఎన్నికలు తేలుస్తాయని మోదీ చెప్పారు. భాజపా తరపుÛన సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కిరణ్‌బేడీని ప్రశంసిస్తూ.. దిల్లీ గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉందన్నారు. కిరణ్‌బేడీ దృఢనిశ్చయమున్న మహిళ అని, ఆమెకు పరిపాలనపరంగానూ మంచి అనుభవం ఉందని, దిల్లీని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలరని తెలిపారు. ఆప్‌కు గట్టి మద్దతుదార్లుగా పేరున్న పేద, నిమ్నవర్గాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ”నా ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం. దేశం స్వాతంత్య్రం సాధించి 2022 నాటికి 75 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా.. 2022 నాటికి మురికివాడలన్నింటిలోనూ పక్కాగృహాలను నిర్మించాలన్న ప్రణాళిక నాకుంది. దీనిని దిల్లీ నుంచే ప్రారంభిస్తా”నని చెప్పారు. దిల్లీలోని ప్రతివీధికీ సేవ చేసే అవకాశం తనకివ్వాలని, తాను భుజం భుజం కలిపి పనిచేసేటువంటి ప్రభుత్వం దిల్లీలో ఏర్పడాలని చెప్పారు. ఈ సభలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీ తదితరులు పాల్గొన్నారు.