భాజాపా, కాంగ్రెస్ వద్ద డబ్బు తీసుకోండి
ఓటు ఆప్‌కు వేయండి-కేజ్రీవాల్
దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : దిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, భాజపా నుంచి డబ్బు తీసుకుని ఆప్‌కు ఓటేయాలని ఓ సభలో కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని రంగంలోకి దించింది. కిరణ్ బేడీ సైతం సరికొత్త వ్యూహాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పరోక్షంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. అన్నాహజారేతో జనలోక్‌పాల్ బిల్లు డిమాండ్ సందర్భంగా చేపట్టిన ఆందోళనల్లో కిరణ్‌బేడీ, కేజ్రీవాల్‌లు ఇద్దరు సంఘటితంగా పోరాడారు. కిరణ్ గతంలో ఐపీఎస్ అధికారిణిగా చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు తనకు కలిసొచ్చే అంశాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా అజయ్ మాకెన్‌ను రంగంలోకి దించడంతో దిల్లీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకన్నది. ఈ నేపథ్యంలోనే ఎవరి స్థాయిలో వారు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ ఈ వివాహాస్పద వ్యాఖ్యలు చేశారు.