భానుడి ప్రచండం నిప్పుల కొలిమిగా రాష్ట్రం

పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు
ఒక్కరోజే 23 మంది మృతి
హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) :
భానుడు ప్రచండరూపం దాల్చాడు. ఆయన ఉగ్రరూపం ధాటికి గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 23 మంది మృత్యువాతపడ్డారు. మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతోంది. ఉదయం నుంచే ఎండ మండుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ వేసవిలోనే గత రెండ్రోజులుగా అత్యధికంగా ఎండ ప్రభావం కనిపించింది. గురువారం ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెంటచింతలలో 47, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, నిజామాబాద్‌ 45.5, హైదరాబాద్‌, నెల్లూరు, మహబూబ్‌నగర్‌లో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఎండవేడిమి తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు.
నిప్పుల కొలిమిలా రాజధాని.
హైదరాబాద్‌లో ఈసీజన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో గురువారం రెండో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదైంది. ఎండ, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో నగరవాసులు విలవిల్లాలడారు. ఉదయం నుంచే ఎండ మండడంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. పదకొండు గంటల నుంచే రహదారులన్నీ బోసిపోయాయి. ఎండ వేడిమి తాళలేక ఇంట్లో ప్రజలకు విద్యుత్‌ కోతలు చుక్కలు చూపించాయి. అధికార కోతలకు తోడు అనధికారంగా గంటల తరబడి కోసేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండ, లోపల ఉక్కపోతతో విలవిల్లాడారు. గతంలో హైదరాబాద్‌లో ఎంత ఎండ ఉన్నా చెమట వచ్చేది కాదు. కానీ, ఈసారి మాత్రం ఉక్కపోత, చెమటలతో జనం అవస్థలు పడుతున్నారు. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, పచ్చదనం అంతరించిపోవడం, కాలుష్యం స్థాయిని మించిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు పేర్కొన్నారు.
మరో 20 రోజులు ఇలాగే…
గత పదేళ్లలో రాష్ట్రంలో రెండోసారి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ రెండో వారం వరకూ రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణ, దక్షిణ కోస్తాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరో రెండు, మూడ్రోజుల పాటు వడగాల్పుల ప్రభావం కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమాదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. వీటికి తోడు విద్యుత్‌ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు, ఎండ వేడిమి, వేడిగాలుల తీవ్రతతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నారులు అస్వస్థత బారిన పడుతున్నారు. వడదెబ్బ, న్యూమోనియా, జ్వరంతో బాధ పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని నిలోఫర్‌, నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. అయితే, పడకలు లేవని ఆస్పత్రి సిబ్బంది చేర్చుకొనేందుకు నిరాకరిస్తున్నారు.
23 మంది మృత్యువాత
రాష్ట్రంలో ఎండ తీవ్రతకు గురువారం ఒక్కరోజే 23 మంది మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున వడదెబ్బతో మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరిలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌, నల్గొండ, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.